చైర్మన్ ఎన్నికల్లో రాజకీయ వివాదం..

by Batti.Sumithra |

నకిరేకల్ మండలంలోని మూసి మత్స్య పారిశ్రామిక సహకార సంఘం చైర్మన్ ఎన్నికల్లో రాజకీయ వివాదం నెలకొంది.

చైర్మన్ ఎన్నికల్లో రాజకీయ వివాదం..
X

దిశ, నకిరేకల్ : నకిరేకల్ మండలంలోని మూసి మత్స్య పారిశ్రామిక సహకార సంఘం చైర్మన్ ఎన్నికల్లో రాజకీయ వివాదం నెలకొంది. శనివారం జరగాల్సిన చైర్మన్ ఎన్నిక రాజకీయ ఉద్రిక్తతల నడుమ వాయిదా పడింది. 13 మంది సభ్యులతో కూడిన ఈ సంఘంలో ఉదయం 10 గంటల వరకు సభ్యులు హాజరు కాకపోవడంతో ఎన్నికల అధికారి శ్రీరామ్ ఎన్నికను వాయిదా వేసినట్లు ప్రకటించారు. తదుపరి ఎన్నికల తేదీని ఉన్నతాధికారులతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

ఎన్నికల్లో గెలిచిన ఆలువాల వెంకటస్వామి మాట్లాడుతూ 13 మంది అభ్యర్థుల్లో ఏడుగురు తమ ప్యానల్ అభ్యర్థులేనని, అయినప్పటికీ అధికారులు తమకు చైర్మన్ ఎన్నిక నిర్వహించడంలో సహకరించలేదని ఆరోపించారు. తమ ప్యానల్‌కు మెజారిటీ ఉన్నప్పటికీ అధికార పార్టీ నాయకుల ఒత్తిడి మేరకు చైర్మన్ ఎన్నిక నిర్వహించలేదని అన్నారు. తమ ప్యానల్‌లో గెలిచిన అభ్యర్థుల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు ఉన్నప్పటికీ వారి పై బెదిరింపులు, ఒత్తిళ్లు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాణ స్వీకారం రోజున సైతం గెలిచిన అభ్యర్థులను బంధించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా చైర్మన్ ఎన్నిక నిర్వహించాలని ఉన్నతాధికారులను కోరుతామని తెలిపారు.

Next Story