- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Women’s T20 World Cup : రేపు ఆస్ట్రేలియాతో కీలక పోరు.. టీమిండియా సెమీస్‌కు చేరుకోవడానికి మూడు మార్గాలు
టీ20 వరల్డ్ కప్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు తాడోపేడో తేల్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

దిశ, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు తాడోపేడో తేల్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. సెమీస్ బెర్త్ కోసం కీలక పోరుకు సిద్ధమైంది. నేడు తమ చివరి గ్రూపు మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ప్రతిష్టాత్మకమైన లార్డ్స్ మైదానం వేదిక. నాకౌట్‌కు చేరుకోవాలంటే ఈ మ్యాచ్‌లో గెలవడం తప్పనిసరి. గ్రూపు దశలో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన భారత జట్టు మూడింటి గెలిచింది. సౌతాఫ్రికా చేతిలో ఓటమి పాలవ్వగా గత గేములో బంగ్లాపై నెగ్గి తిరిగి పుంజుకుంది. ఆదివారం ఆస్ట్రేలియాతో భారత్‌కు గట్టి సవాల్ ఎదురుకానుంది. ఫిబ్రవరిలో కంగారుల గడ్డపైనే భారత్ టీ20 సిరీస్ కైవసం చేసుకుంది. ఆ విజయం భారత ప్లేయర్లలో ఆత్మవిశ్వాసం నింపేదే. కానీ, ప్రస్తుతం ఆ జట్టు వరుసగా నాలుగు విజయాలతో దూకుడు మీద ఉంది. కాబట్టి, భారత జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శన చేస్తేనే ఆసిస్‌ను అడ్డుకోవచ్చని విశ్లేషకులు సూచిస్తున్నారు.
సెమీస్‌కు క్వాలిఫై అవ్వాలంటే?
గ్రూపు-ఏ నుంచి రెండు సెమీస్ బెర్త్‌ల కోసం ఆస్ట్రేలియా, భారత్, సౌతాఫ్రికా మధ్య పోటీ నెలకొంది. ప్రస్తుతం ఆసిస్(8 పాయింట్స్, +4.724 నెట్‌రన్‌రేట్) అగ్రస్థానంలో ఉండగా.. భారత్(6 పాయింట్స్, +2.268), సౌతాఫ్రికా(6 పాయింట్స్, +0.734) రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. నేడు ఆసిస్‌తో భారత్, బంగ్లాదేశ్‌తో దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. భారత్ సెమీస్‌కు చేరుకోవడానికి మూడు మార్గాలు ఉన్నాయి. ఒక్కటి భారత్ గెలిచి.. దక్షిణాఫ్రికా ఓడిపోవాలి. అప్పుడు ఆసిస్, భారత్ చెరో 8 పాయింట్లతో నాకౌట్‌కు వెళ్తాయి. ఒకవేళ భారత్ ఓడిపోతే.. దక్షిణాఫ్రికాపై బంగ్లా గెలవాలి. అప్పుడు మెరుగైన నెట్‌రన్‌రేట్‌తో ఇండియానే ముందంజ వేస్తుంది. ఇది రెండోది. ఇక మూడోది.. భారత్, దక్షిణాఫ్రికా రెండు జట్లు ఓడిపోయినా ఇండియా సెమీస్‌కు చేరుకుంటుంది. అప్పుడు కూడా మెరుగైన నెట్‌రన్‌రేట్ ఉండటం వల్ల టీమిండియాకు ఎక్కువ చాన్స్‌లు ఉన్నాయి. అయితే, భారత్ ఓడి.. దక్షిణాఫ్రికా గెలిస్తే మాత్రం ఇంటిదారిపట్టాల్సిందే.
షెఫాలీ, శ్రీచరణికి తోడెవరు?
ఈ ప్రపంచకప్‌లో భారత్ బ్యాటింగ్ దళాన్ని ఓపెనర్ షెఫాలి వర్మ ఒంటిచేత్తో లాగుతోంది. ప్రతి మ్యాచ్‌లోనూ ఆమె కీలక ఇన్నింగ్స్ ఆడుతూ భారత్ గెలుపు కోసం చెమటోడుస్తోంది. గత మ్యాచ్‌లోనూ బంగ్లాపై ఆమె హాఫ్ సెంచరీ బాదింది. ఇతర బ్యాటర్లు పెద్దగా ఆకట్టుకోకపోవడం భారత జట్టును ఆందోళనకు గురిచేస్తోంది. స్మృతి మంధాన మంచి ఫామ్‌లోనే ఉన్నా గత మ్యాచ్‌లో నిరాశపర్చింది. అయితే, ఆమె సామర్థ్యంపై జట్టు నమ్మకంగా ఉంది. కానీ, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, రిచా ఘోష్, రోడ్రిగ్స్, యాస్తికా భాటియా మాత్రం తమ స్థాయి ప్రదర్శన చేయడం లేదు. కొన్ని రన్స్ జోడించి అవుటవడం మినహా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించేలా వారు ఆడలేదు. నేటి మ్యాచ్ భారత్‌కు ఎంత కీలకమో అందరికీ తెలుసు. గత మ్యాచ్‌ల్లాగా బ్యాటింగ్ తేలిపోతే మాత్రం ఆసిస్‌ను ఓడించడం చాలా కష్టం. కాబట్టి, ఈ గేములో ప్రతి బ్యాటర్ సత్తాచాటాల్సిన అవసరం ఉంది. మరోవైపు, బంతితోనూ భారత్ పరిస్థితి అలాగే ఉంది. స్పిన్నర్ శ్రీచరణి నిలకడగా రాణిస్తోంది. రాధ యాదవ్ బంగ్లాపై 3 వికెట్లు తీసి ఆకట్టుకుంది. అయితే, పేసర్ల నుంచే ఆశించిన ప్రదర్శన రావడం లేదు. బలమైన బ్యాటింగ్ దళం ఉన్న ఆస్ట్రేలియాను కట్టడి చేయాలంటే భారత బౌలర్లు సమిష్టిగా రాణించడం ఒక్కటే మార్గం.
ఆసిస్ 27.. భారత్ 10
ఇరు జట్ల మధ్య టీ20 పోరులో ఆసిస్‌దే ఆధిపత్యం. 37 సార్లు ఇరు జట్లు తలపడితే అందులో ఆస్ట్రేలియానే 27 సార్లు గెలిచింది. భారత్ 10 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది.






