TG: రాజకీయ పార్టీలకు ఈసీ కీలక సూచన

by Gantepaka Srikanth |

ఎస్‌ఐఆర్‌‌ను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని ప్రతీ పోలింగ్‌ స్టేషన్‌కు కనీసం ఒక బూత్‌ లెవల్‌ ఏజెంట్‌‌ను నియమించాలని రాజకీయ పార్టీలను తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్‌‌రెడ్డి కోరారు.

TG: రాజకీయ పార్టీలకు ఈసీ కీలక సూచన
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎస్‌ఐఆర్‌‌ను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని ప్రతీ పోలింగ్‌ స్టేషన్‌కు కనీసం ఒక బూత్‌ లెవల్‌ ఏజెంట్‌‌ను నియమించాలని రాజకీయ పార్టీలను తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్‌‌రెడ్డి కోరారు. బూత్‌ స్థాయిలో బలమైన సమన్వయం ఈ ప్రక్రియకు కీలకమని ఆయన స్పష్టం చేశారు. ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో గురువారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీఎల్‌ఏలను సాధ్యమైనంత వరకు ఆయా పోలింగ్‌ స్టేషన్‌ల పరిధిలోని స్థానికుల నుంచే ఎంపిక చేయాలని.. వారు బూత్‌ లెవల్‌ అధికారులతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఓటర్ల జాబితా సవరణ సమయంలో ఖచ్చితత్వం, పారదర్శకత, సమస్యల సకాల పరిష్కారం కోసం ప్రతీ పోలింగ్‌ బూత్‌కు కనీసం ఒక బీఎల్‌ఏ తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ కొనసాగుతున్నదని.. మిగతా రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలోనూ షెడ్యూల్‌ ఏప్రిల్‌-మే మధ్య ప్రకటించే అవకాశం ఉన్నదని వివరించారు.

నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాత సమయం పరిమితంగా ఉంటుండటంతో రాష్ట్రంలో ముందస్తు సన్నాహక పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని చెప్పారు. ఇందులో భాగంగా 2025 ఓటర్ల జాబితాలో ఉన్న ఓటర్లను 2002 ఎస్‌ఐఆర్‌లో నమోదైన ఓటర్లతో అనుసంధానించేలా టేబుల్‌టాప్‌ మ్యాపింగ్‌ చేపట్టామని తెలిపారు. అనంతరం ఫీల్డ్‌ స్థాయి మ్యాపింగ్‌ కొనసాగుతుండగా, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో నివాసాలను గుర్తించి ధ్రువీకరించేందుకు బీఎల్‌ఓలు ఇంటింటి సర్వేలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఎస్‌ఐఆర్‌ సమయంలో ప్రతీ పోలింగ్‌ ప్రాంతాన్ని బీఎల్‌ఓలు మూడు నుంచి నాలుగు సార్లు సందర్శిస్తారని తెలిపారు. మొదటి సందర్శనలో ఎన్యుమరేషన్‌ ఫారాలు పంపిణీ చేస్తారని.. తదుపరి సందర్శనల్లో ముందుగా అందుబాటులో లేని కుటుంబాలను కవర్‌ చేస్తారని.. సన్నాహక దశలో మ్యాపింగ్‌ కాకపోయిన ఓటర్లు కూడా ఎస్‌ఐఆర్‌ సమయంలో తమ వివరాలు సమర్పించుకునే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. బూత్‌ స్థాయిలో ఫిర్యాదులను తగ్గించి, అర్హులైన ఏ ఒక్క ఓటరు కూడా ఓటర్ల జాబితా నుంచి తప్పిపోకుండా చేయడంలో బీఎల్ఏల నియామకం సహాయపడుతుందని చెప్పారు. ఈ సమావేశంలో అదనపు సీఈఓ వాసం వెంకటేశ్వర్‌‌రెడ్డి, డిప్యూటీ సీఆర్‌ఓ హరిసింగ్‌ తదితర అధికారులు పాల్గొన్నారు.

Next Story