- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోచన్నపేటలో ఉద్రిక్తత
సిద్దిపేట జిల్లా బచ్చన్నపేట మండలం పోచన్నపేట గ్రామంలో గురువారం ఇసుక రవాణా అంశంపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

దిశ, బచ్చన్నపేట : సిద్దిపేట జిల్లా బచ్చన్నపేట మండలం పోచన్నపేట గ్రామంలో గురువారం ఇసుక రవాణా అంశంపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆన్‌లైన్ స్లాట్ల ఆధారంగా పెద్దవాగు నుంచి ఇసుక తరలించేందుకు వచ్చిన ట్రాక్టర్లను గ్రామ రైతులు, స్థానికులు అడ్డుకుని వెనక్కి పంపించారు. పెద్దవాగు నుంచి నిరంతరాయంగా ఇసుక తవ్వకాల కారణంగా గ్రామంలో భూగర్భ జలమట్టం తగ్గిపోతోందని, వ్యవసాయ బోరుబావులు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పనులు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం పరిమిత సంఖ్యలో అనుమతులు తీసుకుని, వాటి పేరుతో వాణిజ్య అవసరాలకు పెద్ద ఎత్తున ఇసుక తరలిస్తున్నారని ఆరోపించారు.
వాగులోకి వరుసగా ట్రాక్టర్లు రావడంతో రైతులు సంఘటనా స్థలానికి చేరుకుని నిరసన చేపట్టారు. స్లాట్లు బుక్ చేసుకున్నామని చెప్పిన ట్రాక్టర్ డ్రైవర్లతో వాగ్వాదానికి దిగిన రైతులు, ఒక్క ట్రాక్టర్‌ను కూడా ఇసుకతో వెళ్లనివ్వకుండా వెనక్కి పంపించారు. ప్రభుత్వం కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన చెక్‌డ్యామ్ సమీపంలో భారీ గోతులు తవ్వి ఇసుకను తరలించడం వల్ల చెక్‌డ్యామ్ పునాదులు బలహీనపడే ప్రమాదం ఉందని, పర్యావరణానికి కూడా ముప్పు వాటిల్లుతోందని స్థానికులు ఆరోపించారు. ఆన్‌లైన్ స్లాట్ల పేరిట ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నప్పటికీ రెవెన్యూ, మైనింగ్, పోలీసు శాఖలు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నాయని రైతులు విమర్శించారు. పోచన్నపేట పెద్దవాగు నుంచి ఇసుక రవాణాను వెంటనే నిలిపివేయాలని, లేనిపక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.






