బహదూర్‌గూడలో ఉద్రిక్తత.. 650 ఎకరాల భూములకు హైడ్రా ఫెన్సింగ్

by Jakkula.Mamatha |   (  Updated:2026-07-18 02:22:23  IST  )

శంషాబాద్ మండలం బహదూర్‌గూడ గ్రామంలోని సర్వే నంబర్లు 28, 68 పరిధిలో ఉన్న 650 ఎకరాల భూములకు ఫెన్సింగ్ ఏర్పాటు చేసేందుకు హైడ్రా, రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు.

బహదూర్‌గూడలో ఉద్రిక్తత.. 650 ఎకరాల భూములకు హైడ్రా ఫెన్సింగ్
X

దిశ, శంషాబాద్: శంషాబాద్ మండలం బహదూర్‌గూడ గ్రామంలోని సర్వే నంబర్లు 28, 68 పరిధిలో ఉన్న 650 ఎకరాల భూములకు ఫెన్సింగ్ ఏర్పాటు చేసేందుకు హైడ్రా, రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. తెల్లవారుజామునే వారు చేరుకున్నారు. పనులకు ఆటంకం కలగకుండా ఉండేందుకు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచే అధికారులు, పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఏర్పాట్లు చేపట్టారు. 10 మంది ఎస్సైలు, ఐదు మహిళా పోలీసు ప్లాటూన్లు, ఐదు పికప్ వాహనాలు, ఒక గ్యాస్‌లైన్ వాహనంతో భారీ భద్రత కల్పించారు.

పెద్ద షాపూర్‌లోని ఎస్వీ రెడ్డి గార్డెన్ వద్ద పోలీసు బలగాలు సమీకరించి అక్కడి నుంచి భూముల వద్దకు తరలించారు. ఫెన్సింగ్ పనులకు ఎలాంటి అంతరాయం కలగకుండా రైతులను అదుపులోకి తీసుకునేందుకు కూడా పోలీసులు సిద్ధంగా ఉన్నారు. దీంతో బహదూర్‌గూడ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ 650 ఎకరాల భూములపై రైతులు, ప్రభుత్వానికి మధ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు చేపట్టిన చర్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రస్తుతం భూముల వద్ద భారీగా పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. నలుగురు రాజకీయ నాయకులు కూడా ఘటన స్థలానికి చేరుకుంటున్నారు.

Next Story