గూడెప్పాడ్ స్టేజి వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్ నేతల వాహనాలను ఆపిన పోలీసులు

by Batti.Sumithra |

ఆత్మకూర్ మండలంలోని గూడెప్పాడ్ స్టేజి వద్ద ఆదివారం కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

గూడెప్పాడ్ స్టేజి వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్ నేతల వాహనాలను ఆపిన పోలీసులు
X

దిశ, ఆత్మకూర్ : ఆత్మకూర్ మండలంలోని గూడెప్పాడ్ స్టేజి వద్ద ఆదివారం కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు (కేటీఆర్) కాలేశ్వరం పర్యటనకు వెళ్తున్న సందర్భంగా స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేటీఆర్ తన కాన్వాయ్‌లో నుంచి లేచి స్థానిక నాయకులకు అభివాదం చేశారు. అనంతరం పలువురు నాయకులు ఒకేసారి జంక్షన్ వద్దకు చేరుకోవడంతో పోలీసులు వారిని పక్కకు పంపించి, కేటీఆర్ కాన్వాయ్‌ను ముందుకు సాగనిచ్చారు. అదే సమయంలో పలువురు బీఆర్ఎస్ నేతల వాహనాలను పోలీసులు సుమారు అరగంటపాటు నిలిపివేశారు.

దీంతో వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగూర్ల వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకుడు ఏనుగు రాకేష్ రెడ్డి తదితరులు పోలీసులను ప్రశ్నిస్తూ, తమ వాహనాలను ఎందుకు నిలిపివేశారని నిలదీశారు. పోలీసుల తీరును నిరసిస్తూ "పోలీసుల దౌర్జన్యం నశించాలి", "జై తెలంగాణ.. జై జై తెలంగాణ" అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. అనంతరం పోలీసులు వారి వాహనాలను అనుమతించడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే మరికొన్ని వాహనాలను కూడా ఆత్మకూర్ పోలీసులు అరగంటకుపైగా నిలిపివేయడంతో గూడెప్పాడ్ స్టేజి నుంచి ఎన్‌ఎస్‌ఆర్ హోటల్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో సామాన్య ప్రయాణికులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూర్, దామెర మండలాల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story