దౌల్తాబాద్ PACS వద్ద ఉద్రిక్తత.. 100% సబ్సిడీ విత్తనాల కోసం పోటెత్తిన రైతులు

by Jakkula.Mamatha |

100 శాతం సబ్సిడీ పై కంది, పెసర విత్తన మినీ కిట్లు పంపిణీ చేస్తున్నట్లు ప్రకటించడంతో దౌల్తాబాద్ మండలంలోని వివిధ గ్రామాల నుంచి వందలాది మంది రైతులు సోమవారం ఉదయం PACS కార్యాలయానికి చేరుకున్నారు

దౌల్తాబాద్ PACS వద్ద ఉద్రిక్తత.. 100% సబ్సిడీ విత్తనాల కోసం పోటెత్తిన రైతులు
X

దిశ, కొడంగల్: 100 శాతం సబ్సిడీ పై కంది, పెసర విత్తన మినీ కిట్లు పంపిణీ చేస్తున్నట్లు ప్రకటించడంతో దౌల్తాబాద్ మండలంలోని వివిధ గ్రామాల నుంచి వందలాది మంది రైతులు సోమవారం ఉదయం PACS కార్యాలయానికి చేరుకున్నారు. ఒక్కసారిగా భారీ సంఖ్యలో రైతులు తరలిరావడంతో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మండలానికి కేవలం 1000 కంది మినీకిట్లు, 200 పెసర మినీకిట్లు మాత్రమే కేటాయించగా, అర్హులైన రైతుల సంఖ్య మాత్రం వేలల్లో ఉండటంతో పంపిణీ విషయంలో రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు. మినీకిట్లు అందరికీ సరిపోవని తెలిసి రైతులు అధికారులను నిలదీశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి రైతులకు అవగాహన కల్పించడంతో పరిస్థితి సద్దుమణిగింది.

ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి జి. తులసి మాట్లాడుతూ, దౌల్తాబాద్ మండలంలోని 33 గ్రామ పంచాయతీలకు సుమారు 30 మినీకిట్ల చొప్పున కేటాయించి పంపిణీ చేస్తామని తెలిపారు. ప్రభుత్వం నుంచి వచ్చిన పరిమిత కోటా మేరకే పంపిణీ జరుగుతోందని, రైతులు సహకరించాలని కోరారు. అయితే మండల వ్యాప్తంగా వేలాది మంది రైతులు ఉండగా, ఒక్కో గ్రామానికి కేవలం 30 మినీకిట్లు మాత్రమే కేటాయించడం సరిపోదని పలువురు రైతులు అభిప్రాయం వ్యక్తం చేశారు. మరిన్ని మినీకిట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Next Story