- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంటర్ బోర్డు వద్ద ఉద్రిక్త వాతావరణం.. ఏబీవీపీ నేతలు సహ విద్యార్థుల అరెస్ట్
హైదరాబాద్ ఇంటర్ బోర్డు ముట్టడి. విద్యార్థి సంఘాల ధర్నాతో నాంపల్లి లో ఉద్రిక్తత! హాల్ టికెట్లు, ఫీజుల సమస్యలపై నిరసన.. ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు సహా పలువురు నేతలు, విద్యార్థులు అరెస్ట్.

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని నాంపల్లీలో ఉన్న ఇంటర్మీడియట్ బోర్డు ఉద్రిక్త వాతావరణ నెలకొంది. ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య తీరుకు వ్యతిరేకంగా ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు నాంపల్లిలోని బోర్డు కార్యాలయం ముందు మెరుపు ధర్నాకు దిగారు. సుమారు 300 మంది విద్యార్థులకు హాల్ టికెట్లు జారీ చేయకుండా వారి భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నారని విద్యార్థి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు, నాయకులు బోర్డు లోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తీవ్ర తోపులాట జరిగి ఉద్రిక్తత నెలకొంది.
కార్పొరేట్ కాలేజీలతో కుమ్మక్కయ్యారు: మాచర్ల రాంబాబు
రంగంలోకి దిగిన పోలీసులు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు సహా పలువురు నేతలను, విద్యార్థులను బలవంతంగా అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. "సెక్రటరీ కృష్ణ ఆదిత్య కార్పొరేట్ కాలేజీలతో కుమ్మక్కై విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. అక్రమ అరెస్టులకు మేము భయపడబోమని. 300 మంది విద్యార్థులకు వెంటనే హాల్ టికెట్లు జారీ చేసే వరకు మా పోరాటం ఆగదు" అని హెచ్చరించారు.
ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమవుతున్న తరుణంలో హాల్ టికెట్లు రాకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి సాంకేతిక కారణాలను సరిదిద్ది హాల్ టికెట్లు జారీ చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఇంటర్ బోర్డు వద్ద భారీగా పోలీసులను మోహరించారు.






