- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో వర్షాలు.. భారీగా తగ్గనున్న పగటి ఉష్ణోగ్రతలు
తెలంగాణలో రానున్న మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో.. భారీగా పగటి ఉష్ణోగ్రతలు తగ్గనున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రజలకు ఎండల తీవ్రత నుండి ఉపశమనం కలిగిస్తూ భారత వాతావరణ శాఖ(IMD) చల్లని వార్తను అందించింది. బుధవారం విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడా పడే సూచనలు ఉన్నాయని తెలిపింది. దీనివల్ల గత కొద్దిరోజులుగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఎండ వేడి తగ్గి వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుందని అధికారులు వెల్లడించారు. ఈ మార్పుల వల్ల పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 3 డిగ్రీల వరకు తగ్గుతాయని, దీనివల్ల వేసవి తాపం నుంచి ప్రజలకు కొంత ఉపశమనం లభించనుంది.
హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలోని మెజారిటీ జిల్లాల్లో రానున్న మూడు రోజులు ఆకాశం మేఘావృతమై ఉంటుందని ఐఎండీ పేర్కొంది. రాజధాని హైదరాబాద్‌లో మే 6న ఉష్ణోగ్రత 38–39°C వరకు నమోదయ్యే అవకాశం ఉండగా, మే 7 మరియు 8 తేదీల్లో అది మరింత తగ్గి 37–38°C వద్ద స్థిరపడవచ్చు. అయితే, వర్షాలు కురిసే సమయంలో ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉన్నందున రైతులు, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా కోతకు వచ్చిన పంటలను భద్రపరుచుకోవడంలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఉరుములు వచ్చే సమయంలో ఆరుబయట ఉండకూడదని సూచించారు. ఈ అకాల వర్షాలు ఎండల నుంచి ఉపశమనం ఇచ్చినప్పటికీ, బలమైన గాలుల వల్ల కలిగే నష్టాన్ని నివారించేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. కాగా నిన్న వీచిన భారీ ఈదురుగాలులకు మంచిర్యాల జిల్లాలో షెడ్డు కూలి నలుగురు వ్యక్తులు మృతి చెందిన సంగతి తెలిసిందే.






