- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
12 ఏళ్ల బీజేపీ పాలనలో ఏం చేశారో చెప్పండి : జగ్గారెడ్డి
కేంద్ర రంగ సంస్థలైన బీహెచ్‌ఈఎల్, బీడీఎల్, ఓడీఎఫ్, ఇక్రిశాట్, ఐఐటీ హైదరాబాద్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలను సంగారెడ్డి జిల్లాకు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు.

దిశ, సంగారెడ్డి : కేంద్ర రంగ సంస్థలైన బీహెచ్‌ఈఎల్, బీడీఎల్, ఓడీఎఫ్, ఇక్రిశాట్, ఐఐటీ హైదరాబాద్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలను సంగారెడ్డి జిల్లాకు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. శుక్రవారం రాహుల్ గాంధీ 56వ జన్మదినాన్ని పురస్కరించుకుని జగ్గారెడ్డి ఆధ్వర్యంలో భారీ స్థాయిలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సంగారెడ్డి నియోజకవర్గ పరిధిలోని 350 మంది చిన్నారులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు. అనంతరం స్థానిక ఆర్ అండ్ బీ అతిథి గృహంలో 200 కిలోల భారీ కేక్‌ను ఆయన సతీమణి, టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల, ఇతర చిన్నారులతో కలిసి కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ హయాంలో జిల్లాకు కేంద్ర రంగ సంస్థలను తీసుకొస్తే, ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం ఉన్న కేంద్ర రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తోందని విమర్శించారు.
బీజేపీ నాయకులు నెహ్రూ పాలనను అధిగమించామని సంబరాలు చేసుకుంటున్నారని, అయితే రాహుల్ గాంధీ తల్లి, తండ్రి, తాత, నానమ్మ, ముత్తాత దేశానికి చేసిన సేవల గురించి తాను చెప్పడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. అదే విధంగా, 12 ఏళ్ల ప్రధాని మోదీ పాలనలో దేశానికి ఏమి చేశారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన ప్రధాని మోదీ, 12 ఏళ్లలో 24 కోట్ల ఉద్యోగాలను యువతకు బాకీ పడ్డారని ఆరోపించారు. బీజేపీ నాయకులు దేవుళ్ల పేరుతోనే కుట్రలు చేస్తున్నారని, ఇతర రాజకీయ పార్టీలకు దేవుళ్లతో సంబంధం లేదన్నట్లుగా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. దేశ అభివృద్ధి కోసం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఉందని, ఉమ్మడి రాష్ట్ర ప్రజలతో పాటు దేశ ప్రజలందరూ ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత కిషన్, మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘురాం గౌడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కిరణ్ గౌడ్, ఇతర నాయకులు, కార్యకర్తలు, చిన్నారులు పాల్గొన్నారు.






