- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డైనింగ్ హాల్ లేక ఆరుబయట తింటున్న తెలంగాణ గురుకుల విద్యార్థులు!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో ఏర్పాటైన ఏన్కూర్ తెలంగాణ గురుకుల పాఠశాల ప్రస్తుతం తీవ్ర సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది.

దిశ,ఏన్కూర్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో ఏర్పాటైన ఏన్కూర్ తెలంగాణ గురుకుల పాఠశాల ప్రస్తుతం తీవ్ర సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. ఎంతో ప్రతిభ ఉంటేనే ఈ పాఠశాలలో సీటు దక్కించుకోవడం సాధ్యమవుతుంది. అలాంటిది, ఇక్కడికి వచ్చిన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు నరకప్రాయంగా మారింది. ఐదో తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఇక్కడ సుమారు 680 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అయితే, వీరికి కనీసం తినడానికి డైనింగ్ హాల్ లేకపోవడంతో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో ఆరుబయటే కూర్చుని తినాల్సి వస్తుంది.
వాతావరణం బాగున్నప్పుడు ఎలాగోలా బయట తింటున్నా, వర్షం పడితే మాత్రం విద్యార్థుల బాధలు వర్ణనాతీతంగా మారుతున్నాయి. తలదాచుకోవడానికి, ప్రశాంతంగా తినడానికి చోటు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేవలం విద్యార్థులే కాకుండా, ఇక్కడ విద్యాబోధన చేసే ఉపాధ్యాయులకు కూడా ఉండటానికి క్వార్టర్స్ సౌకర్యం లేకపోవడంతో వారు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. "మేము చేసిన పాపం ఏమిటి?" అంటూ విద్యార్థులు ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మానవతా దృక్పథంతో స్పందించి, తమ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని, తక్షణమే డైనింగ్ హాల్, ఇతర వసతులు కల్పించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.






