యూరియా కోసం రైతుల అవస్థలు

by Jakkula.Mamatha |

మండలంలో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

యూరియా కోసం రైతుల అవస్థలు
X

దిశ, దౌల్తాబాద్: మండలంలో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూరియా కొనుగోలు కోసం తప్పనిసరిగా మొబైల్ ద్వారా బుకింగ్ చేయాల్సి రావడంతో చదువురాని, స్మార్ట్‌ఫోన్ లేని రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మాకు పెద్ద మొబైళ్లు లేవు.. చదువు కూడా లేదు.. మేము యూరియా ఎలా బుక్ చేసుకోవాలి? అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఇతరులను ఆశ్రయించి యూరియా బుక్ చేయమని అడిగితే, మీకు మొబైల్ లేదా?అంటూ తిరస్కరిస్తున్నారని రైతులు వాపోతున్నారు. పంటలు కీలక దశలో ఉండగా యూరియా అందక రైతులు ఎరువుల దుకాణాలు, వ్యవసాయ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. గంటల తరబడి క్యూలో నిల్చున్న యూరియా దొరుకుతుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది.

దీంతో రైతుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వ హయాంలో యూరియా కోసం ఇలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని, ప్రస్తుతం విధించిన ఆన్‌లైన్ బుకింగ్ విధానం గ్రామీణ ప్రాంతాల రైతులకు భారంగా మారిందని పలువురు రైతులు విమర్శిస్తున్నారు. డిజిటల్ విధానాలు అమలు చేయడం మంచిదే అయినప్పటికీ, స్మార్ట్‌ఫోన్ లేని, చదువురాని రైతులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా అమలు చేయడం అన్యాయమని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి గ్రామ స్థాయిలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని, స్మార్ట్‌ఫోన్ లేకున్నా రైతులు నేరుగా యూరియా పొందే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే రైతు సంఘాలతో కలిసి ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నామని హెచ్చరిస్తున్నారు.

=నా పేరు సంఘని లక్ష్మమ్మ మాది మహమ్మద్ షాపూర్, నాకు రెండు ఎకరాల భూమి ఉంది. కొంచెం మొక్కజొన్న, వేశాను. కొంచెం వరి వేస్తున్నాను. యూరియా కోసం ఎక్కడ వెళ్లిన ఫోన్‌లో బుక్ చేసుకోమని చెబుతున్నారు. నాకు భర్త లేడు నాకు పిల్లలు లేరు. ఎవరి దగ్గరికి వెళ్లిన మొబైల్‌లో చేస్తలేరు. నేను ఏం చేయాలి. మాలాంటి చదువురాని వాళ్లకు, ఫోన్లు లేని వాళ్లకు ఎవరు సహకరిస్తే లేరు. అటు వ్యవసాయ శాఖకు మీరే బుక్ చేసుకోవాలని చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామని ఆమె తెలిపారు.

Next Story