క్రికెటర్ నుంచి డీజీపీ దాకా.. సీవీ ఆనంద్ ప్రయాణం

by Muthe.Rajitha |

తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖకు కొత్త బాస్ వచ్చారు. రాష్ట్ర తదుపరి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(DGP)గా సీవీ ఆనంద్ నియమితులయ్యారు.

క్రికెటర్ నుంచి డీజీపీ దాకా.. సీవీ ఆనంద్ ప్రయాణం
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖకు కొత్త బాస్ వచ్చారు. రాష్ట్ర తదుపరి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP)గా సీవీ ఆనంద్ నియమితులయ్యారు. ఏప్రిల్ 30న ప్రస్తుత ఇన్‌చార్జ్ డీజీపీ బి. శివధర్ రెడ్డి పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో, మే మొదటి వారంలో ఆనంద్ బాధ్యతలు స్వీకరించనున్నారు. హోం శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోదాలో ఉన్న ఆయనను ఈ అత్యున్నత పదవి వరించడం వెనుక దశాబ్దాల కఠోర శ్రమ, నిజాయితీ దాగి ఉన్నాయి.

క్రికెట్ మైదానం నుండి ఖాకీ దుస్తుల వరకు

సీవీ ఆనంద్ అందరికీ ఒక మంచి పోలీస్ అధికారిగానే తెలుసు. కానీ ఆయన ఒక మేధావి, అంతకంటే మిన్నగా ఒక అద్భుతమైన క్రీడాకారుడు. రంగారెడ్డి జిల్లాలో జన్మించి హైదరాబాద్‌లోనే పెరిగిన ఆయన, ప్రతిష్టాత్మక హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (HPS)లో చదువుకున్నారు. నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేసే సమయానికి ఆయన ఒక స్టార్ క్రికెటర్‌గా ఎదిగారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ ఎకనామిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన ప్రతిభ ఆయనది. ఇండియా అండర్-19 జట్టు తరఫున ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్ళిన ఆనంద్, ఒక దశలో క్రికెట్ ఎంచుకోవాలా? సివిల్స్ ఎంచుకోవాలా అనే సందిగ్ధంలో పడ్డారు. కానీ చదువుపై ఉన్న మక్కువతో కేవలం 22 ఏళ్ల వయసులోనే మొదటి ప్రయత్నంలోనే 147వ ర్యాంకు సాధించి ఐపీఎస్ అధికారిగా ఎంపికయ్యారు.

పోలీసింగ్‌లో తనదైన ముద్ర

పోలీసు అధికారిగా సీవీ ఆనంద్ శైలి ఎప్పుడూ ప్రత్యేకం. ఆయన ఎక్కడ పనిచేసినా అక్కడ శాంతిభద్రతల విషయంలో రాజీ పడలేదు. అత్యంత సమర్థుడైన అధికారిగా పేరు తెచ్చుకోవడమే కాకుండా, తనదైన పనితీరుతో వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. ఆయన కెరీర్‌లోని ముఖ్యాంశాలను పరిశీలిస్తే, ఆయన ఒక "బహుముఖ ప్రజ్ఞాశాలి" అని అర్థమవుతుంది. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్‌గా ఆయన రెండు పర్యాయాలు పనిచేశారు. ముఖ్యంగా నగరంలో సున్నితమైన పరిస్థితులు నెలకొన్నప్పుడు, మత సామరస్యాన్ని కాపాడటంలో ఆయన కీలక పాత్ర పోషించారు. హిందూ-ముస్లింల మధ్య సయోధ్య కుదుర్చుతూ, "ఫ్రెండ్లీ పోలీసింగ్" ద్వారా సామాన్య ప్రజలకు పోలీసుల పట్ల నమ్మకాన్ని పెంచారు.

సైబరాబాద్ కమిషనర్‌గా ఐటీ కారిడార్‌లో భద్రతను కట్టుదిట్టం చేయడంలోనూ ఆయన సఫలీకృతులయ్యారు. యువతను పట్టి పీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టేందుకు హైదరాబాద్‌లో ప్రత్యేక నార్కోటిక్స్ వింగ్ (H-NEW) ఏర్పాటు చేయడం ఆయన తీసుకున్న అత్యంత సాహసోపేతమైన నిర్ణయం. డ్రగ్స్ నెట్‌వర్క్‌ను మూలాల నుంచి దెబ్బతీయడంలో ఈ వింగ్ అద్భుతమైన ఫలితాలను సాధించింది. యాంటీ కరప్షన్ బ్యూరో (ACB) డైరెక్టర్ జనరల్‌గా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత, అవినీతి అధికారుల గుండెల్లో నిద్రపోయారు. లంచం తీసుకోవాలన్నా, అక్రమాలకు పాల్పడాలన్నా భయపడే వాతావరణాన్ని సృష్టించారు. క్షేత్రస్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు ఎవరిని వదలకుండా నిష్పక్షపాతంగా చర్యలు తీసుకున్నారు.

అవార్డులు - రివార్డులు

పోలీసు శాఖకు సీవీ ఆనంద్ చేసిన విశిష్ట సేవలకు గాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎన్నో గౌరవప్రదమైన పురస్కారాలు లభించాయి. క్లిష్ట పరిస్థితుల్లో ప్రదర్శించిన ధైర్యసాహసాలకు గుర్తింపుగా పోలీస్ మెడల్ ఫర్ గాల్లంట్రీ అవార్డు అందుకున్నారు. అత్యున్నత స్థాయి నిబద్ధతతో కూడిన సేవలకు గాను ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఫర్ డిస్టింగ్విష్డ్ సర్వీస్ అవార్డు అందుకున్నారు. విధి నిర్వహణలో చూపిన ప్రతిభకు ఎన్నోసార్లు మెరిటోరియస్ సర్వీస్ అవార్డులు అందుకున్నారు.

సహచరి లలితా ఆనంద్ త్యాగం

సీవీ ఆనంద్ కెరీర్ ఒక ఎత్తయితే, ఆయన సతీమణి లలితా ఆనంద్ ప్రయాణం మరొక ఎత్తు. ఆమె కేవలం ఒక అధికారి భార్యగా మిగిలిపోకుండా, తనకంటూ ఒక అస్తిత్వాన్ని నిర్మించుకున్నారు. వివాహం తర్వాత భర్త కెరీర్ కోసం, పిల్లల భవిష్యత్తు కోసం తన ఉన్నత చదువులను మధ్యలోనే ఆపేశారు. అయితే లోపల ఉన్న జిజ్ఞాస మాత్రం తగ్గలేదు. బాధ్యతలన్నీ తీరిన తర్వాత, తన 40వ ఏట మళ్లీ పుస్తకాలు పట్టి ఐఐటీ మద్రాస్‌లో పీహెచ్‌డీ (మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్) పూర్తి చేయడం ఆమెలోని పట్టుదలకు నిదర్శనం. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB)లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వహించారు. కేవలం అకడమిక్స్‌లోనే కాకుండా, 57 ఏళ్ల వయసులో భరతనాట్యం అరంగేట్రం చేసి అసాధ్యం అనే పదాన్ని తన నిఘంటువులో లేదని లలితా ఆనంద్ నిరూపించారు. డయాబెటిస్‌ను తన జీవనశైలి మార్పులతో రివర్స్ చేసుకుని, ఆరోగ్య స్పృహపై ఎంతోమందికి అవగాహన కల్పిస్తూ.. జీవిత భాగస్వామి పేరును మరో మెట్టు ఎక్కించారు. ఆమె ప్రయాణం ఎంతో మంది గృహిణులకు ఒక గొప్ప స్ఫూర్తి అని చెప్పుకోవాలి.

ఆదర్శ కుటుంబం

సీవీ ఆనంద్ దంపతులు తమ పిల్లలను కూడా అదే స్ఫూర్తితో పెంచారు. వారి పెద్ద కుమారుడు చామ మిలింద్ తన తండ్రి బాటలోనే క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకుని, అండర్-19 ఇండియా టీమ్, ఐపీఎల్‌లో ఆర్‌సీబీ తరఫున ఆడి ప్రొఫెషనల్ క్రికెటర్‌గా గుర్తింపు పొందారు. సీవీ ఆనంద్ ఇప్పటికీ నిత్యం టెన్నిస్, క్రికెట్ ఆడుతూ తన ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటారు.

నిష్పక్షపాత శైలికి మెచ్చిన ప్రభుత్వాలు

ఏప్రిల్ 30న పదవీ విరమణ చేయనున్న 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి బి. శివధర్ రెడ్డి స్థానంలో వస్తున్న ఆనంద్, తెలంగాణ పోలీస్ వ్యవస్థను మరిన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తారని రాష్ట్ర ప్రజలు ఆశిస్తున్నారు. సీవీ ఆనంద్ ప్రత్యేకత ఏమిటంటే.. ఆయన వృత్తినిబద్ధతను గమనించి అటు కేసీఆర్ ప్రభుత్వం, ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఆయనపై పూర్తి నమ్మకాన్ని ఉంచాయి. ప్రభుత్వాలు మారినా, ఆయన నిష్పక్షపాత శైలి, నేరాలను అణచివేసే విధానం కారణంగా ఆయన ఎప్పుడూ కీలక బాధ్యతల్లోనే కొనసాగారు. సామాన్యుడికి స్నేహితుడిగా, నేరగాళ్లకు సింహస్వప్నంగా ఆయన తన ప్రయాణాన్ని విజయవంతంగా నడిపిస్తున్నారు.

Next Story