దేశంలోనే వినూత్న సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ

by Ratna Kumari |

దేశంలోనే వినూత్న సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని, పేద ప్రజల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ పథకం ద్వారా సాకారం చేస్తోందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.

దేశంలోనే వినూత్న సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ
X

దిశ, ధర్మసాగర్ : దేశంలోనే వినూత్న సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని, పేద ప్రజల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ పథకం ద్వారా సాకారం చేస్తోందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. గురువారం ధర్మసాగర్ మండల కేంద్రంలో రూ.92 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించడంతో పాటు నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులతో కలిసి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. పేద ప్రజలకు సొంత ఇల్లు కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రెండేళ్లలోనే రూ.35 వేల కోట్లతో 7 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ అని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పేరుతో గొప్పలు చెప్పిందేగానీ, ధర్మసాగర్ వంటి పెద్ద గ్రామ పంచాయతీలో ఒక్క ఇల్లు కూడా నిర్మించి ఇవ్వలేదని విమర్శించారు.

తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత రెండున్నరేళ్లలో ధర్మసాగర్ అభివృద్ధికి రూ.2 కోట్ల విలువైన పనులు చేపట్టామని, అందులో భాగంగానే ఈరోజు రూ.92 లక్షల అభివృద్ధి పనులను ప్రజలకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు. గతంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న సమయంలో మండల కార్యాలయాల సముదాయం, జూనియర్ కళాశాల, ధర్మసాగర్ రిజర్వాయర్ వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొచ్చినట్లు గుర్తుచేశారు.

ధర్మసాగర్‌కు మరో 100 ఇందిరమ్మ ఇళ్లు ..

గ్రామంలో ఇంకా అనేక అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉందని పేర్కొన్న ఎమ్మెల్యే, రెండో విడతలో ధర్మసాగర్ గ్రామానికి మరో 100 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. గుడిసెలు, పెంకుటిళ్లు, రేకుల ఇళ్లలో నివసిస్తున్న అర్హులైన పేదలకు రాజకీయాలకు అతీతంగా ఇళ్లను అందేలా ప్రజాప్రతినిధులు, అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

నాలుగు లైన్ల రహదారి, పర్యాటక కేంద్రంగా ధర్మసాగర్ ..

ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) నుంచి ఎల్కుర్తి క్రాస్ వరకు నాలుగు లైన్ల రహదారి నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. గ్రామ ప్రజలు సహకరిస్తే ఆ రహదారి నిర్మాణ బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. అలాగే ధర్మసాగర్ రిజర్వాయర్‌ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మాచర్ల జ్యోతి ఏలీయా, తహసీల్దార్, ఎంపీడీవో, హౌసింగ్ డీఈ, వివిధ గ్రామాల సర్పంచులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Next Story