267.. ఉఫ్.. పంజాబ్ కింగ్స్ రికార్డును బ్రేక్ చేసిన వాషింగ్టన్ ఫ్రీడమ్

by Harish |

ఈ ఏడాది ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ పెట్టిన 265 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ ఛేదిస్తే వావ్ అని ఆశ్చర్యపోయాం.

267.. ఉఫ్.. పంజాబ్ కింగ్స్ రికార్డును బ్రేక్ చేసిన వాషింగ్టన్ ఫ్రీడమ్
X

దిశ, స్పోర్ట్స్ : ఈ ఏడాది ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ పెట్టిన 265 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ ఛేదిస్తే వావ్ అని ఆశ్చర్యపోయాం. అప్పుడు అది టీ20 క్రికెట్‌లో రికార్డు చేజింగ్‌. కానీ, తాజాగా ఆ రికార్డు బద్దలైంది. మేజర్ లీగ్ క్రికెట్(ఎంఎల్‌సీ) ఫ్రాంచైజీ వాషింగ్టన్ ఫ్రీడమ్.. పంజాబ్ కింగ్స్ రికార్డును బ్రేక్ చేసింది. 267 పరుగుల లక్ష్యాన్ని ఉఫ్ అనేసి టీ20 క్రికెట్‌లో వరల్డ్ రికార్డు సృష్టించింది. గురువారం ఎంఎల్‌సీ లీగ్‌లో ఎంఐ న్యూయార్క్‌తో జరిగిన ఎలిమినేటర్‌లో వాషింగ్టన్ ఫ్రీడమ్ ఈ ఘనత సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఎంఐ న్యూయార్క్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 266 రన్స్ చేసింది. కెప్టెన్ నికోలస్ పూరన్ 33 బంతుల్లో 106 పరుగుతో మెరుపు శతకం బాదాడు. 31 బంతుల్లో సెంచరీ చేసిన అతను ఫ్రాంచైజీ టీ20ల్లో గేల్(30) తర్వాత ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. అతనికితోడు డికాక్(51), కీరన్ పొలార్డ్(64) కూడా హాఫ్ సెంచరీలు చేశారు.

దీంతో ఎంఐ న్యూయార్క్ .. వాషింగ్టన్ ఫ్రీడమ్ ముందు 267 పరుగుల భారీ లక్ష్యాన్ని పెట్టింది. ఈ టార్గెట్‌ను ఆ జట్టు మరో 8 బంతులు మిగిలి ఉండగానే ఛేదించడం విశేషం. 4 వికెట్లు కోల్పోయి 270 పరుగులు చేసి గెలుపొందింది. ఆ జట్టులో ఆండ్రీస్ గౌస్(132), స్టీవ్ స్మిత్(110 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కి వాషింగ్టన్ ఫ్రీడమ్‌ను గెలిపించారు. వీరిద్దరే 241 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో పలు రికార్డులు కూడా నమోదయ్యాయి. ఓ టీ20 మ్యాచ్‌లో ముగ్గురు సెంచరీలు చేయడం ఇదే తొలిసారి. అలాగే, ఈ గేములో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 51 సిక్సర్లు వచ్చాయి. టీ20 మ్యాచ్‌లో అత్యధిక సిక్స్‌లు ఇవే. ఇంతకుముందు 42 సిక్సర్లు రికార్డుగా ఉండగా ఈ మ్యాచ్ దాన్ని బ్రేక్ చేసింది.

Next Story