‘విద్యాశాఖ మంత్రిగా సోనమ్ వాంగ్‌చుక్‌ను నియమించాలి’.. సీజేపీ నిరసనలో కేజ్రీవాల్

by Ramesh Naini |

నీట్-యూజీ (NEET-UG) పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ 19 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌ను ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ గురువారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కలిశారు.

‘విద్యాశాఖ మంత్రిగా సోనమ్ వాంగ్‌చుక్‌ను నియమించాలి’.. సీజేపీ నిరసనలో కేజ్రీవాల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: నీట్-యూజీ (NEET-UG) పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ 19 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌ను ఆప్ (AAP) అధినేత అరవింద్ కేజ్రీవాల్ గురువారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కలిశారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ప్రధాని మోడీ వెంటనే ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి తొలగించి, ఆ స్థానంలో సోనమ్ వాంగ్‌చుక్‌ను కేంద్ర విద్యాశాఖ మంత్రిగా చేయాలని డిమాండ్ చేశారు. యువత, కాక్రోచ్ (Cockroach) ఉద్యమం, వాంగ్‌చుక్ మాట వినకపోతే.. మూడేళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వానికి 2014 నాటి చేదు అనుభవం తప్పదని ఆయన హెచ్చరించారు.

కోర్టుకు కేంద్రం హామీ..

మరోవైపు, 59 ఏళ్ల వాంగ్‌చుక్ పట్ల ప్రభుత్వం ఒక ఉగ్రవాదిలా వ్యవహరిస్తోందని, ఆయన ప్రాణాలను కాపాడేందుకు బలవంతంగానైనా ఆహారం ఇప్పించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL)పై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. దీనిపై స్పందించిన కేంద్రం.. ఆయన ఆరోగ్యాన్ని ప్రతిరోజూ పర్యవేక్షిస్తామని, అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని కోర్టుకు హామీ ఇచ్చింది. జూన్ 28న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) ఆధ్వర్యంలో మొదలైన ఈ దీక్షకు పలువురు ప్రతిపక్ష నేతలు మద్దతు తెలుపుతూ.. దీక్ష విరమించాలని వాంగ్‌చుక్‌ను కోరుతున్నారు. విద్యార్థుల సమస్యల పట్ల ప్రధాని సున్నితంగా వ్యవహరించాలని, రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో దీనిపై చర్చ జరగాలని వాంగ్‌చుక్ స్పష్టం చేశారు. మంత్రి రాజీనామా అనేది కేవలం ఆరంభం మాత్రమేనని ఆయన పేర్కొన్నారు.

Next Story