Supreme Court: సీబీఎస్‌ఈ త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టులో విచారణ

by S Gopi |

నేర్చుకోవాలనుకుంటే ఆ భాషను 6వ తరగతి నుంచే నేర్పించాలి. ఎంత త్వరగా నేర్పిస్తే అంత సులభంగా పిల్లలు గ్రహిస్తారు' అని ఆమె తన సొంత పాఠశాల రోజులను గుర్తుచేసుకుంటూ పేర్కొన్నారు.

Supreme Court: సీబీఎస్‌ఈ త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టులో విచారణ
X

దిశ, నేషనల్ బ్యూరో: సీబీఎస్ఈ పాఠ్యప్రణాళికలో భాగంగా 9వ తరగతి నుంచి మూడో భాషను తప్పనిసరి చేయడంపై సుప్రీంకోర్టు గురువారం ఆందోళన వ్యక్తం చేసింది. తమిళనాడులో జవహర్ నవోదయ విద్యాలయాల (జేఎన్‌వీ) ఏర్పాటుపై మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఆర్. మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా జస్టిస్ నాగరత్న కేంద్ర ప్రభుత్వానికి, సీబీఎస్ఈ బోర్డుకు కీలక సూచనలు చేశారు. '9వ తరగతి అనేది విద్యార్థులకు అత్యంత ఒత్తిడితో కూడుకున్న దశ. 8వ తరగతి నుంచే పిల్లలపై బోర్డు పరీక్షల భారం మొదలవుతుంది. అటువంటి సమయంలో కొత్త భాషను ప్రవేశపెట్టడం సరికాదు. నేర్చుకోవాలనుకుంటే ఆ భాషను 6వ తరగతి నుంచే నేర్పించాలి. ఎంత త్వరగా నేర్పిస్తే అంత సులభంగా పిల్లలు గ్రహిస్తారు' అని ఆమె తన సొంత పాఠశాల రోజులను గుర్తుచేసుకుంటూ పేర్కొన్నారు.

కేంద్రం పథకాలపై తమిళనాడు మొండి వైఖరి వీడాలి

మూడు భాషల విధానం ద్వారా కేంద్రం తమపై హిందీని రుద్దుతోందన్న తమిళనాడు వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ విధానంలో ఎక్కడా హిందీని తప్పనిసరి చేయలేదని, మాతృభాష, ఇంగ్లీషులతో పాటు మూడవ భాషగా సంస్కృతం లేదా మరేదైనా ప్రాంతీయ భాషను ఎంచుకునే స్వేచ్ఛ ఉందని కోర్టు గుర్తుచేసింది. 'మీకు హిందీ వద్దు సరే.. మరి సంస్కృతం నేర్చుకుంటే వచ్చే నష్టం ఏముంది?' అని తమిళనాడును ధర్మాసనం ప్రశ్నించింది. కేవలం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం అనే ఒకే ఒక్క కారణంతో నవోదయ పాఠశాలలను అడ్డుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి హితవు పలికింది. రాష్ట్రానికి సొంత విద్యా విధానం ఉన్నప్పటికీ, కేంద్ర పాఠశాలలను అడ్డుకోవడం సరికాదని స్పష్టం చేసింది. ప్రస్తుతం నవోదయ పాఠశాలల ఏర్పాటుకు స్థలం కేటాయింపుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఇంకా చర్చలు జరుగుతున్నందున, తదుపరి చర్యల కోసం కోర్టు తమిళనాడు ప్రభుత్వానికి ఆరు వారాల సమయం ఇచ్చింది.

Next Story