మిల్క్ ట్యాంకర్ బోల్తా.. పాల కోసం ఎగబడ్డ జనం

by Muthe.Rajitha |

బీహార్లో పాల ట్యాంకర్ బోల్తా పడటంతో జనం పాల కోసం ఎగబడ్డ ఘటన చోటు చేసుకుంది.

మిల్క్ ట్యాంకర్ బోల్తా.. పాల కోసం ఎగబడ్డ జనం
X

దిశ, వెబ్ డెస్క్ : బీహార్లో పాల ట్యాంకర్ బోల్తా పడటంతో జనం పాల కోసం ఎగబడ్డ ఘటన చోటు చేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న ఒక పాల ట్యాంకర్ ప్రమాదవశాత్తు బోల్తా పడటంతో, అక్కడున్న స్థానికులు సాయం చేయడం పక్కన పెట్టి పాలు పట్టుకెళ్లడానికి పోటీ పడ్డారు. పాట్నా పరిధిలో వేగంగా వెళ్తున్న ఒక పాల ట్యాంకర్ అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. దీంతో ట్యాంకర్‌లోని పాలు రోడ్డుపై పొంగిపొర్లాయి. దీన్ని గమనించిన స్థానికులు క్షణాల వ్యవధిలో ఇళ్లలో నుంచి బిందెలు, బకెట్లు, చెంబులు, డబ్బాలతో ఘటనా స్థలానికి పరుగు తీశారు. రోడ్డుపై పారుతున్న పాలను పట్టుకోవడానికి ఒకరినొకరు నెట్టుకుంటూ ఎగబడ్డారు. మరికొందరైతే ఏకంగా కింద పారుతున్న పాలకు అక్కడే నోరు పెట్టి తాగడం గమనార్హం.

ప్రమాదం జరిగిన వెంటనే ట్యాంకర్ డ్రైవర్ పోలీసులకు సమాచారం అందించాడు. అయితే, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే లోపే స్థానిక జనం ట్యాంకర్‌లో ఉన్న పాలనంతటినీ పూర్తిగా ఖాళీ చేసేశారు. తీవ్రమైన నష్టంతో ఏం చేయాలో పాలుపోక డ్రైవర్ నెత్తీనోరు బాదుకోవడం అక్కడ ఉన్నవారిని కలచివేసింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Next Story