మూగ జీవికి పునర్జన్మ.. బావిలో పడ్డ జింకను కాపాడిన ఫారెస్ట్ సిబ్బంది

by Taduka Kalyani |

మర్పల్లి మండలంలోని బుచన్‌పల్లి గ్రామ సమీపంలో మృత్యువుతో పోరాడుతున్న ఓ జింకను అటవీ శాఖ అధికారులు చాకచక్యంగా రక్షించారు.

మూగ జీవికి పునర్జన్మ..  బావిలో పడ్డ జింకను కాపాడిన ఫారెస్ట్ సిబ్బంది
X

దిశ, మర్పల్లి : మర్పల్లి మండలంలోని బుచన్‌పల్లి గ్రామ సమీపంలో మృత్యువుతో పోరాడుతున్న ఓ జింకను అటవీ శాఖ అధికారులు చాకచక్యంగా రక్షించారు. సుమారు 40 గజాల లోతైన పాడుబడ్డ బావిలో చిక్కుకున్న ఆ మూగజీవికి అటవీ సిబ్బంది ప్రాణదానం చేశారు. బుధవారం రాత్రి సమయంలో ఆహారం కోసం సంచరిస్తున్న జింక, ప్రమాదవశాత్తు అడుగు తడబడటంతో బుచన్‌పల్లి గ్రామ శివార్లలోని పాడుబడ్డ బావిలో పడిపోయింది. చీకటి కావడంతో ఎవరూ గమనించలేదు. గురువారం ఉదయం స్థానిక గ్రామస్తుడు రత్నం ఆ వైపు వెళ్లగా, బావిలోంచి జింక అరుపులు వినిపించాయి. వెంటనే ఆయన అప్రమత్తమై అటవీ శాఖ అధికారి కిషన్‌కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ఫారెస్ట్ అధికారి కిషన్ తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితి తీవ్రతను గమనించి, ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఎఫ్‌ఆర్వో (FRO) శ్రీదేవి సరస్వతి పర్యవేక్షణలో అటవీ సిబ్బంది ప్రత్యేక జాగ్రత్తలతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఎంతో శ్రమించి, క్షేమంగా జింకను బావిలోంచి బయటకు తీశారు.సకాలంలో స్పందించి, మూగజీవి ప్రాణాలను కాపాడిన అటవీ శాఖ అధికారులను గ్రామస్తులు అభినందించారు. అనంతరం ఆ జింకకు ప్రథమ చికిత్స చేసి, సురక్షితంగా అడవిలోకి వదిలిపెట్టినట్లు అధికారులు తెలిపారు.

Next Story