మహిళా సంఘం నిధుల వ్యవహారంలో అవకతవకల ఆరోపణలు

by Ratna Kumari |   (  Updated:2026-07-16 15:29:46  IST  )

ముస్తాబాద్ మండలం తుర్కపల్లి గ్రామంలో మహిళా సంఘం నిధుల నిర్వహణకు సంబంధించి ఆర్థిక అవకతవకల ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.

మహిళా సంఘం నిధుల వ్యవహారంలో అవకతవకల ఆరోపణలు
X

దిశ, ముస్తాబాద్ : ముస్తాబాద్ మండలం తుర్కపల్లి గ్రామంలో మహిళా సంఘం నిధుల నిర్వహణకు సంబంధించి ఆర్థిక అవకతవకల ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. మహిళా సంఘానికి చెందిన రూ.25 వేల నగదును సభ్యులకు తెలియకుండా వ్యక్తిగత అవసరాలకు వినియోగించారని, సంఘానికి సంబంధించిన సీఏ భర్తపై మహిళలు, గ్రామ యువకులు ఆరోపిస్తున్నారు. సభ్యుల కథనం ప్రకారం.. గత నెలలో మహిళా సంఘం నగదును బ్యాంకులో జమ చేస్తానని చెప్పి తీసుకున్నప్పటికీ, దాదాపు రెండు నెలల పాటు జమ చేయకుండా వ్యక్తిగత అవసరాలకు వినియోగించినట్లు తెలుస్తోంది. అనంతరం సభ్యులు నిలదీయడంతో ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించినట్లు సమాచారం. అలాగే మరో రూ.6 వేల నగదు లావాదేవీలకు సంబంధించిన వివరాలు కూడా సరిగా నమోదు కాలేదని అధికారులు ప్రాథమిక విచారణలో గుర్తించినట్లు తెలుస్తోంది.

డీపీఎం అధికారుల సమక్షంలో విచారణ..

మహిళా సంఘ సభ్యుల ఫిర్యాదు మేరకు డీపీఎం అధికారుల సమక్షంలో విచారణ నిర్వహించారు. గత ఐదు నెలల బ్యాంకు స్టేట్‌మెంట్‌లు, లావాదేవీలను పరిశీలించగా సుమారు రూ.6 వేల ఖర్చులకు సంబంధించిన సరైన లెక్కలు చూపలేదని సభ్యులు ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు వెలుగులోకి తేవాలని వారు కోరుతున్నారు.

సీఏను తొలగించాలని డిమాండ్..

ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు, ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న సీఏను తొలగించి ఆ స్థానంలో ఎస్సీ మహిళకు అవకాశం కల్పించాలని మహిళా సంఘ సభ్యులు డిమాండ్ చేశారు.

మహిళలపై భారం పడుతుందనే ఆందోళన..

సంఘ నిధుల నిర్వహణలో జరిగినట్లు ఆరోపణలు ఎదురవుతున్న అవకతవకల కారణంగా చివరకు మహిళలపైనే ఆర్థిక భారం పడే పరిస్థితి ఏర్పడుతుందని సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంఘ నిధులను పారదర్శకంగా నిర్వహించి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

యువకుల ఫిర్యాదుతో వెలుగులోకి..

గ్రామ యువకులు ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ ఆరోపణలపై సంబంధిత అధికారుల పూర్తి విచారణ అనంతరం వాస్తవాలు నిర్ధారణ కావాల్సి ఉంది. ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Next Story