- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మళ్లీ తెరపైకి తుమ్మిడి హెట్టి..!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని తుమ్మిడి హెట్టి ప్రాజెక్ట్ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని తుమ్మిడి హెట్టి ప్రాజెక్ట్ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. 2006లో వైఎస్సార్ శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టును గత బీఆర్ఎస్ ప్రభుత్వం పక్కనపెట్టింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి ప్రాజెక్టు పూర్తి కోసం పట్టుదలతో ఉన్నారు. మహారాష్ట్రతో ఒప్పందం కుదుర్చుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 7న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాజెక్టు క్షేత్రస్థాయి పర్యటన ఖరారైంది. అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం అనంతరం, మహారాష్ట్ర నేతలతో సీఎం చర్చించనున్నారు. ప్రాజెక్టు పూర్తయితే ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల తూర్పు ప్రాంతానికి భారీ ప్రయోజనం చేకూరుతుంది. 60వేల ఎకరాల వరకు ఆయకట్టుకు గ్రావిటీ ద్వారా సాగునీరు అందుతుందని రైతాంగం ఆశిస్తోంది. సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, మంచిర్యాల నియోజకవర్గాల రైతులకు ఇది శుభవార్త కాగా, తుమ్మిడి హెట్టి నిర్మాణంపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతాంగంలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.
- దిశ ప్రతినిధి, నిర్మల్
దిశ ప్రతినిధి, నిర్మల్ : 2006లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ‘జలయజ్ఞం’ పేరుతో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన తుమ్మిడి హెట్టి బహుళార్ధసాధక ప్రాజెక్టు మరోసారి తెరపైకి వచ్చింది. గత కేసీఆర్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రతిపాదిత ఈ ప్రాజెక్టును పక్కనపెట్టి, కాలేశ్వరం ప్రాజెక్టును తెరపైకి తెచ్చిన విషయం తెలిసిందే. అయితే, కాలేశ్వరం తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో తుమ్మిడి హెట్టి ప్రాజెక్టును కచ్చితంగా చేపట్టాలన్న సంకల్పంతో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత ప్రాజెక్టు వ్యవహారాన్ని మళ్లీ తెరపైకి తెచ్చారు. మహారాష్ట్రతో ఒప్పందం కుదుర్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడడంతో కొత్త ప్రాజెక్టు నిర్మాణంపై రైతాంగంలో ఆశలు చిగురిస్తున్నాయి. గత ప్రభుత్వం తుమ్మిడి హెట్టిని మరుగున పడేయడం వల్ల ఉమ్మడి ఆదిలాబాద్ తూర్పు ప్రాంతంలోని ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు తీరని అన్యాయం జరిగిందన్న అభిప్రాయాలు ఉన్నాయి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మహారాష్ట్రతో సంప్రదింపులు జరుపుతుండడంతో ప్రాజెక్టు నిర్మాణంపై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి.
తూర్పు జిల్లాకు భారీగా సాగునీటి అవకాశం..
సిర్పూర్ పేపర్ మిల్లు, సింగరేణి ప్రాంతం విస్తరించి ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ తూర్పు ప్రాంతంలోని ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలు సాగునీటి సరఫరా సజావుగా లేక రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. చిన్న చిన్న ప్రాజెక్టులు ఉన్నప్పటికీ, భారీస్థాయిలో ప్రాజెక్టు లేకపోవడం వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. తాజాగా మహారాష్ట్రతో సంప్రదింపులు జరుపుతున్న నేపథ్యంలో ప్రాజెక్టు నిర్మాణం కచ్చితంగా జరిగి తీరుతుందన్న ఆశలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే తూర్పు జిల్లాకు లక్ష ఎకరాలకు పైగా సాగునీరు అందుతుందని రైతాంగం ఆశిస్తోంది. సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూరు నియోజకవర్గాలకు ఈ ప్రాజెక్టు ఒక వరంగా మారుతుందని భావిస్తున్నారు. గ్రావిటీ ద్వారా సాగునీటి సరఫరా జరిగే ఈ ప్రాజెక్టు వల్ల రైతాంగానికి భారీ మేలు చేకూరుతుందని అధికారులు కూడా అభిప్రాయపడుతున్నారు. గత ప్రభుత్వం ఇక్కడ ప్రాజెక్టును పక్కనపెట్టడం వల్ల ఈ ఐదు నియోజకవర్గాల రైతులకు తీరని అన్యాయం జరిగిందని, తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్రతో ఒప్పందానికి సిద్ధపడడంతో రైతాంగంలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయని చెప్పవచ్చు.
7న సీఎం రేవంత్ పర్యటన..!
ప్రాణహిత నదిపై నిర్మించనున్న కొత్త ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం దూకుడు మొదలుపెట్టింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మూసివేసిన ఈ ప్రాజెక్టును సీఎం రేవంత్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. మహారాష్ట్రతో ఉన్న జలవివాదాలను పరిష్కరించి, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాజెక్టు నిర్మాణం చేపడతామని ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలోనే, ఈనెల 7న సీఎం రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయి పర్యటనకు రానున్నారు. మహారాష్ట్రతో చర్చలు జరపడానికి ముందు, స్థానిక ఇంజనీరింగ్ అధికారులతోపాటు, ఇరిగేషన్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. ఈ సమావేశం తర్వాత, త్వరలోనే మహారాష్ట్రకు వెళ్లి అక్కడి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో సమావేశం అవుతారని సమాచారం.






