- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ప్రభుత్వం ఇఫ్తార్ విందు
తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నేడు ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందు నిర్వహించనున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే రంజాన్ ఇఫ్తార్ విందు ఆదివారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఘనంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితోసహా పలువురు మంత్రులు హాజరై, ముస్లిం సోదరులతో కలిసి విందులో పాల్గొననున్నారు. ఈ వేడుకను పురస్కరించుకుని ప్రభుత్వం ఎల్బీ స్టేడియం ప్రాంగణంలో భారీ ఏర్పాట్లు పూర్తి చేసింది. మత సామరస్యానికి ప్రతీకగా నిర్వహించే ఈ విందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులు, మత పెద్దలు, వేలాది మంది ముస్లిం సోదరులు హాజరయ్యే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, సీనియర్ అధికారులు కూడా ఈ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేయనున్నారు.
ట్రాఫిక్ ఆంక్షలు.. పోలీసుల సూచనలు
ఎల్బీ స్టేడియంలో జరిగే ఈ ఇఫ్తార్ విందు నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ముఖ్యంగా సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఎల్బీ స్టేడియం వైపు వచ్చే రహదారులలో వాహనాల మళ్లింపు ఉండనుంది. వాహనదారులు,ప్రయాణికులు లక్డీకాపూల్, రవీంద్ర భారతి, బషీర్‌బాగ్, బిజెఆర్ విగ్రహం, ఎస్‌బిఐ గన్‌ఫౌండ్రీ, ఎ.ఆర్. పెట్రోల్ పంప్, సమీప జంక్షన్‌లలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అధికారులు కోరుతున్నారు. అత్యవసర సమయాల్లో ట్రాఫిక్ హెల్ప్ లైన్ 9010203626 ను సంప్రదించాలని సూచించారు. విందుకు హాజరయ్యే వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలను కేటాయించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్టేడియం లోపల, వెలుపల భారీ పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు.






