TG: డబుల్ బెడ్రూం ఇళ్ల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం

by Gantepaka Srikanth |

రాష్ట్రంలోని డబుల్ బెడ్రూం (2బీహెచ్కే) ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

TG: డబుల్ బెడ్రూం ఇళ్ల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని డబుల్ బెడ్రూం (2బీహెచ్కే) ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు వివిధ ఇంజనీరింగ్ శాఖల పర్యవేక్షణలో ఉన్న అన్ని 2బీహెచ్కే ప్రాజెక్టులను ఇకపై తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీహెచ్సీఎస్) పరిధిలోకి బదిలీ చేస్తూ రవాణా, రహదారులు మరియు భవనాల శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. మరింత వేగంగా నిర్మాణాలు, ప్రాజెక్టుల పూర్తి చేసి లబ్ధిదారులకు ఇళ్లను అప్పగించే ప్రక్రియను వేగవంతం చేయడంలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి కె. రామకృష్ణారావు జీవో ఎంఎస్ నంబర్ 5ను విడుదల చేశారు. గతంలో ఇతర ఇంజనీరింగ్ శాఖలకు అప్పగించిన అన్ని డబుల్ బెడ్రూం ప్రాజెక్టులను తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ తక్షణమే స్వాధీనం చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లాల్లో ఉన్న ప్రాజెక్టులను ప్రస్తుత ఏజెన్సీల నుండి సంబంధిత హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్లకు బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రాజెక్టులను బదిలీ చేసే బాధ్యతను కమిషనర్‌కు అప్పగించారు. ఇళ్ల పూర్తి, కేటాయింపు ప్రక్రియలో గత ఏడాది మార్చి 22న విడుదల చేసిన జీవో నంబర్ 33లోని సమగ్ర మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ ప్రక్రియపై తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్, రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

Next Story