తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జులకు ‘మంత్రి’ యోగం

by Malleboina Mahesh |

తెలంగాణ కాంగ్రెస్‌ కో-ఇన్‌చార్జులుగా పనిచేసిన ఎన్‌ఎస్ బోసురాజు (కర్ణాటక), పి. విశ్వనాథ్ (తమిళనాడు) లకు మంత్రి పదవులు దక్కడం విశేషం.

తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జులకు ‘మంత్రి’ యోగం
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఏఐసీసీ కార్యదర్శులుగా పని చేసిన వారికి అదృష్టం కలిసి వచ్చి మంత్రి పదవులు తలుపు తడుతున్నాయి. ప్రస్తుత రాష్ట్ర పార్టీ ఏఐసీసీ ఇంచార్జి కార్యదర్శి మీనాక్షి నటరాజన్‌కి సహాయ కార్యదర్శిగా పనిచేస్తున్న పి.విశ్వనాథ్​ఇటీవల తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మేలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే తమిళనాడులో టీవీకేకి మెజార్టీ రాకపోవడంతో ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇతర పార్టీల మద్దతుతో విజయ్ సీఎం అయిన సంగతి తెలిసిందే. తాజాగా గురువారం విజయ్ మంత్రివర్గ విస్తరణ చేపట్టగా ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పి.విశ్వనాథ్, రాజేశ్‌కుమార్‌లు మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేశారు.

దీంతో తమిళనాట సంకీర్ణ ప్రభుత్వంలో దాదాపుగా 59 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కాంగ్రెస్ పార్టీ మళ్లీ భాగస్వామిగా చేరి చరిత్ర సృష్టించింది. విశ్వనాథ్‌కి ఉన్నత విద్యా శాఖను కేటాయించారు. గతంలో 1967లో ఎం.భక్తవత్సలం సీఎంగా కాంగ్రెస్ చివరిసారిగా తమిళనాడులో అధికారంలో ఉన్నది. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు విజయ్ కేబినెట్‌లో చేరింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జుల కార్యదర్శులను అదృష్టం వరిస్తుందన్న చర్చకు బలం చేకూరినట్లైంది. అయితే డీఎంకే కూటమిలో గతంలో కాంగ్రెస్ భాగస్వామిగా ఉన్నా మంత్రివర్గంలో చేరలేదు.

బోసురాజును వరించిన అదృష్టం..

కర్ణాటక ప్రభుత్వంలో ప్రస్తుతం మైనర్ ఇరిగేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రిగా ఎన్‌ఎస్ బోసురాజు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయిన ఆయన 2018 జూన్ నుంచి 2023 జూన్ వరకు తెలంగాణ ఏఐసీసీ కార్యదర్శిగా పనిచేశారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి సంస్థాగత వ్యవహారాలను పర్యవేక్షించడానికి రాహుల్ గాంధీ బోసురాజును ఈ పదవిలో నియమించారు. ఈ క్రమంలో 2023లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన రాయచూరు నగర టికెట్ ఆశించగా ఇతర నేతలు పట్టుబట్టడంతో పార్టీ వారికి కేటాయించింది.

అయితే అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇస్తామని ఏఐసీసీ ఆయనకు హామీ ఇచ్చింది. దీంతో అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ బోసురాజుకు సిద్దరామయ్య మంత్రివర్గంలో చోటు కల్పించింది. ఎమ్మెల్సీగా ఆయన కర్ణాటక శాసనమండలిలోనూ సభా నాయకుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాగా, 2023 మే నెలలో మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటికీ, 2023 జూన్ వరకు తెలంగాణ కో-ఇంచార్జిగా బోసురాజు కొనసాగారు.

Next Story