తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు

by Malleboina Mahesh |   (  Updated:2026-02-06 05:05:44  IST  )

తెలంగాణ సీఎం, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కి రాష్ట్ర హైకోర్టులో చుక్కెదురైంది.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ సీఎం, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy)కి రాష్ట్ర హైకోర్టులో చుక్కెదురైంది. గతంలో తనపై నమోదైన క్రిమినల్ కేసుల (Criminal cases)ను కొట్టివేయాలని కోరుతూ ఆయన హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ వివాదానికి సంబంధించిన తదుపరి విచారణను కోర్టు ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది.

క్రిమినల్ కేసులు ఎందుకంటే..?

సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉండగా.. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో భూపాలపల్లి లో నిర్వహించిన ఒక బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ.. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి (Former MLA Gandra Venkataramana Reddy) పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా, అభ్యంతరకర రీతిలో రేవంత్ రెడ్డి మాట్లాడారని గండ్ర వెంకటరమణ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.

తాజాగా ఈ కేసులను కొట్టివేయాలని (Quash) రేవంత్ రెడ్డి హైకోర్టు (High Court)ను ఆశ్రయించారు. రాజకీయ కారణాలతోనే తనపై కేసులు పెట్టారని ఆయన తరపు న్యాయవాదులు వాదించినప్పటికీ, న్యాయస్థానం ఆ వాదనతో ఏకీభవించలేదు. ప్రాథమిక ఆధారాలను పరిశీలించిన అనంతరం, కేసు విచారణ దశలో ఉన్నందున ఇప్పుడు కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో ఈ నెల 21న జరిగే విచారణలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

అర్బన్ డెవలప్‌‌మెంట్‌పై సీఎం ఫోకస్.. రెండేళ్లలో మున్సిపాలిటీలకు రూ.17 వేల కోట్ల నిధులు

Next Story