అర్బన్ డెవలప్‌‌మెంట్‌పై సీఎం ఫోకస్.. రెండేళ్లలో మున్సిపాలిటీలకు రూ.17 వేల కోట్ల నిధులు

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-06 01:36:08  IST  )

అభివృద్ధికి నిధుల్లేక నీరసించిన నగరాలు అభివృద్ధిబాట పట్టాయి. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల్లో రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించింది.

అర్బన్ డెవలప్‌‌మెంట్‌పై సీఎం ఫోకస్.. రెండేళ్లలో మున్సిపాలిటీలకు రూ.17 వేల కోట్ల నిధులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: అభివృద్ధికి నిధుల్లేక నీరసించిన నగరాలు అభివృద్ధిబాట పట్టాయి. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల్లో రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించింది. ముఖ్యమంత్రే స్వయంగా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండడంతో మున్సిపల్, పట్టణాభివృద్ది శాఖపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. రాష్ట్రంలోని 130 మున్సిపాలిటీలకు వివిధ పథకాల ద్వారా రాష్ట్రప్రభుత్వం రూ.17,472.22 కోట్లు విడుదల చేసింది. వీటితో దాదాపు 3,994 అభివృద్ధి పనులు చేపట్టింది. రోడ్లు రహదారుల నిర్మాణం, వరద నిర్వహణ నియంత్రణ పనులు, చెరువుల్లో కాలుష్యాన్ని అరికట్టడం, కాలనీలు, బస్తీల్లో సౌకర్యాలు కల్పించడం, పబ్లిక్ పార్కులు, నీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థలను మెరుగుపరచడానికి ఈ నిధులను ప్రభుత్వం ప్రణాళికాబ‌ద్ధంగా వినియోగించింది. ప్రజాప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా మున్సిపల్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మున్సిపాలిటీల అభివృద్ధికి సీఎం ప్రత్యేక చొరవ చూపడంతో నగరాలు పరిశుభ్రంగా మారాయి.

మున్సిపల్ శాఖలో సంస్కరణలు..

గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజాప్రభుత్వం మున్సిపల్ శాఖలో సంస్కరణలు చేపట్టింది. పరిపాలన సౌలభ్యంతో పాటు అన్ని పట్టణాల అభివృద్ధి, మెరుగైన పౌర సేవలు, పర్యవేక్షణకు వీలుగా సంస్కరణలు అమల్లోకి తెచ్చారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఒకే శాఖగా ఉన్న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్(MA & UD)ని రెండుగా విభజించారు. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్(టీసీయూఆర్)లో ఉన్న జీహెచ్ఎంసీ, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను అర్బన్ విభాగంగా ఏర్పాటుచేసి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని నియమించారు. కోర్ అర్బన్ రీజియన్ వెలుపల ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను మరో విభాగంగా ఏర్పాటు చేసి మరో సీనియర్ ఐఏఎస్ అధికారిని ప్రభుత్వం నియమించింది. రాష్ట్రాల ప్రత్యేక మూలధన పెట్టుబడి సహాయం(సాస్కీ) పథకం కింద అవసరమైన కీలక సంస్కరణలను ప్రభుత్వం పూర్తిచేసింది. దీంతో సంస్కరణల అనుసంధాన సహాయంగా రూ.1,698 కోట్ల నిధులను పొందేందుకు తెలంగాణ అర్హత సాధించడం విశేషం.

పెండింగ్ పనులకు మోక్షం..

హైదరాబాద్ తరహాలో రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాలను అభివృద్ధి చేయాలనే భవిష్యత్ ఆలోచనలతో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రణాళికలు తయారు చేయించారు. 2019 నుంచి పెండింగ్‌లో ఉన్న స్టాంప్ డ్యూటీ నిధులు రూ.996.27 కోట్లను పట్టణాల అభివృద్ధికి ప్రజాప్రభుత్వం విడుదల చేయడం గమనార్హం. గతంలో రాష్ట్ర వాటా నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో అనేక అభివృద్ధి పనులు ప్రారంభానికి నోచుకోలేదు. ప్రజాప్రభుత్వం రాష్ట్ర వాటాను వెనువెంటనే విడుదల చేస్తుండటంతో ఇంత కాలం పెండింగ్‌లో ఉన్న అన్ని పనులు క్షేత్రస్థాయిలో ప్రారంభమయ్యాయి.

నిధులు కేటాయింపులు..

నగరాభివృద్ధి, పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి (UIDF) ద్వారా 130 మున్సిపాలిటీల్లో 2,374 పనులకు రూ.9,387.11 కోట్ల నిధులను కేటాయించింది. తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్(TUFIDC) ద్వారా 85 మున్సిపాలిటీల్లో1,166 పనులకు రూ.1,896.96 కోట్లు ఖర్చు చేసింది. ట్రాన్స్ ఫర్ డ్యూటీ కింద 110 మున్సిపాలిటీల్లో రూ.462.19 కోట్ల నిధులు అందజేసింది. స్వచ్ఛభారత్ పథకంలో 236 మున్సిపాలిటీల్లో 347 పనులకు రూ.462.19 కోట్లు (ఇందులో రాష్ట్ర వాటా రూ. 286.20 కోట్లు, కేంద్రం వాటా రూ.175.99 కోట్లు) ఉన్నాయి. అటల్ మిషన్ ఫర్ రిజెనవేషన్ అండ్ ట్రాన్ఫమేషన్(అమృత్) పథకంలో భాగంగా 109 మున్సిపాలిటీల్లో 107 పనులకు రూ. 4,729.69 కోట్లకు పరిపాలన అనుమతులు జారీచేసింది.

Next Story