తెలంగాణ ఏసీబీ సరికొత్త రికార్డు

by Muthe.Rajitha |

రాష్ట్రంలో లంచగొండులు, అక్రమార్కులపై అవినీతి నిరోధక శాఖ 2026 రెండో త్రైమాసికంలో ఏసీబీ చేపట్టిన దాడులు, నమోదు చేసిన కేసులు 1983 తర్వాత సరికొత్త రికార్డును సృష్టించాయి.

తెలంగాణ ఏసీబీ సరికొత్త రికార్డు
X

దిశ,తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో లంచగొండులు, అక్రమార్కులపై అవినీతి నిరోధక శాఖ 2026 రెండో త్రైమాసికంలో ఏసీబీ చేపట్టిన దాడులు, నమోదు చేసిన కేసులు 1983 తర్వాత సరికొత్త రికార్డును సృష్టించాయి. గత 43 ఏళ్లలో ఏ త్రైమాసికంలోనూ లేని విధంగా ఈ మూడు నెలల కాలంలోనే అత్యధిక కేసులు నమోదు కావడం గమనార్హం. మంగళవారం ఏసీబీ ప్రధాన కార్యాలయంలో బ్యూరో పనితీరుపై డైరెక్టర్‌ జనరల్‌ చారు సిన్హా నిర్వహించిన సమీక్షలో ఈ గణాంకాలను వెల్లడించారు. అధికారుల వృత్తి నైపుణ్యం, నిరంతర నిఘా కారణంగానే అవినీతి పరుల ఆటలు సాగడం లేదని ఆమె స్పష్టం చేశారు.

ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంసా పత్రాలు..

కేవలం ఈ రెండో త్రైమాసికంలోనే 10 ఆదాయానికి మించిన ఆస్తుల కేసులను నమోదు చేసి అక్రమార్కుల గుట్టు రట్టు చేశారు. అలాగే లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన ఘటనల్లో ఏకంగా 34 కేసులు నమోదయ్యాయి. వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజా సేవలకు ఆటంకం కలిగిస్తున్న అధికారులను లక్ష్యంగా చేసుకుని 23 తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులను ప్రోత్సహించేందుకు రివార్డ్ మేళా ను నిర్వహించి, వారికి ప్రశంసా పత్రాలు, పురస్కారాలను డీజీ అందజేశారు.

అవినీతి చేసిన వారు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదు..

ఈ సంద్బంగా ఏసీబీ డీజీ చారు సిన్హా మట్లాడుతూ..అక్రమాలకు పాల్పడే వారు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదు.1983 నుంచి ఇప్పటివరకు ఉన్న రికార్డులను తిరగరాస్తూ నమోదైన ఈ కేసులు లంచగొండులకు బలమైన హెచ్చరికగా నిలుస్తాయి అని అమె అన్నారు. అవినీతి అనేది దేశాన్ని లోలోన డొల్ల చేసే మహమ్మారి. ఇది సామాన్యుడికి అందాల్సిన ఫలాలను దూరం చేయడమే కాకుండా, వ్యవస్థల పట్ల ప్రజలకున్న నమ్మకాన్ని దెబ్బతీస్తుంది అని ఆమె హెచ్చరించారు. కేవలం దాడులు చేయడమే కాకుండా, కేసుల దర్యాప్తును పారదర్శకంగా నిర్వహించి నేరస్థులకు కఠిన శిక్షలు పడేలా పక్కా ఆధారాలు సేకరించడంపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. నిరంతర శిక్షణ, మెరుగైన దర్యాప్తు ప్రమాణాల ద్వారా సంస్థాగత పటిష్టతను పెంచుతున్నట్లు వివరించారు. ప్రజా విశ్వాసాన్ని కాపాడుతూ, జవాబుదారీతనాన్ని పెంపొందించడంలో ఏసీబీ ఎల్లప్పుడూ ముందుంటుందని అమె అన్నారు. ప్రభుత్వం ఆశిస్తున్న పారదర్శక పాలనలో ఏసీబీ పాత్ర కీలకమని, రాబోయే రోజుల్లో అవినీతి నిరోధక చర్యలను మరింత ముమ్మరం చేస్తామని ఏసీబీ డీజీ చారు సిన్హా వెల్లడించారు.

Next Story