- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రిజిస్ట్రేషన్లకు ‘సాంకేతిక’ బ్రేక్!
రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువల పెంపు నిర్ణయం క్షేత్రస్థాయిలో గందరగోళానికి దారితీస్తోంది.

దిశ, మేడ్చల్ బ్యూరో: రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువల పెంపు నిర్ణయం క్షేత్రస్థాయిలో గందరగోళానికి దారితీస్తోంది. ఈ నెల 5వ తేదీ నుంచి పెరిగిన భూముల ధరలు అమలులోకి వస్తాయని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ.. సాంకేతిక కారణాలతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు బ్రేక్ పడింది. కొత్త ధరలను ఇంకా పబ్లిక్ డొమైన్‌లో పూర్తిస్థాయిలో పొందుపరచకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఫలితంగా పలు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి, ప్రజల డాక్యుమెంట్లు పెండింగ్‌లో పడుతున్నాయి.
ప్రక్రియలో తీవ్ర జాప్యం..
తాజాగా అందిన సమాచారం ప్రకారం.. బాచుపల్లి ఎస్‌ఆర్‌ఓతో పాటు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని మండలాల పరిధిలో ఇదే రకమైన పరిస్థితి నెలకొంది. ఆయా ప్రాంతాల వారీగా పెరిగిన ధరలను నిర్ణయించినప్పటికీ, వాటిని వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసే ప్రక్రియలో లోపాలు తలెత్తినట్లు సమాచారం. ఆన్లైన్ అప్లోడింగ్ సరిగ్గా జరగకపోవడం, సైట్‌లో పలు రకాల సాంకేతిక అవాంతరాలు ఎదురవుతుండటంతో ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రస్తుతం వీటికి సంబంధించిన సవరణలు నడుస్తుండటంతో అధికారులు డేటాను ఇంకా పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులో ఉంచలేదు.
"కొత్త ధరల అప్‌లోడింగ్‌లో కొన్ని సాంకేతిక సవరణలు జరుగుతున్నాయి. ఆ ప్రక్రియ పూర్తిగా పూర్తయిన తర్వాతే వెబ్ సైట్ ద్వారా వివరాలను పబ్లిక్ డొమైన్‌లో పెడతాం" అని మేడ్చల్ మల్కాజిగిరి అదనపు కలెక్టర్ విజేందర్ రెడ్డి, తదితర అధికారులు వివరిస్తున్నారు. అయితే, ఆన్‌లైన్‌లో వివరాలు లేకపోవడంతో ఆస్తుల క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్ల కోసం కార్యాలయాలకు వస్తున్న సామాన్యులు పనులు కాక వెనుదిరగాల్సి వస్తుంది. సమస్య ఎప్పటికీ పరిష్కారం అవుతుందో స్పష్టత లేకపోవడంతో దరఖాస్తుదారులు ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ తీవ్ర అసహనానికి గురవుతున్నారు. అధికారుల సమన్వయ లోపం సామాన్యుల పాలిట శాపంగా మారిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.






