త్వరలో సనత్ నగర్ టిమ్స్ ప్రారంభం : ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి

by Naga Rani Yarlagadda |

హైదరాబాద్ సనత్‌నగర్‌లో నిర్మించిన అత్యాధునిక టిమ్స్ హాస్పిటల్‌ ప్రారంభానికి సంబంధించిన ఏర్పాట్లను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ శనివారం పరిశీలించారు.

త్వరలో సనత్ నగర్ టిమ్స్ ప్రారంభం : ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ సనత్‌నగర్‌లో నిర్మించిన అత్యాధునిక టిమ్స్ హాస్పిటల్‌ ప్రారంభానికి సంబంధించిన ఏర్పాట్లను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ శనివారం పరిశీలించారు. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ హాస్పిటల్‌ను ప్రజలకు అంకితం చేయనున్న నేపథ్యంలో హాస్పిటల్ సంసిద్ధతపై మంత్రి సమగ్ర సమీక్ష నిర్వహించారు. హాస్పిటల్‌లోని ఏ, బీ, సీ బ్లాకులను సందర్శించిన మంత్రి ఓపీ రిజిస్ట్రేషన్, ఇన్‌పేషెంట్ వార్డులు, ఎమర్జెన్సీ విభాగం, ఐసీయూలు, ఆపరేషన్ థియేటర్లు, సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ, డయాగ్నస్టిక్స్, ల్యాబొరేటరీలు, బ్లడ్ బ్యాంక్, మెకనైజ్డ్ ల్యాండ్రీ, సెంట్రలైజ్డ్ కిచెన్, ఫార్మసీ తదితర విభాగాలను పరిశీలించారు. హాస్పిటల్‌లో ఏర్పాటు చేసిన అత్యాధునిక వైద్య పరికరాలు, మౌలిక వసతులు, వైద్య సేవల నిర్వహణ వ్యవస్థలను స్వయంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పెండింగ్‌లో ఉన్న అన్ని పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆర్ అండ్ బీ, ఆరోగ్యశాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నీటి సరఫరా, విద్యుత్, పారిశుధ్యం, సెక్యూరిటీ, ఫైర్ సేఫ్టీ వ్యవస్థలను అత్యున్నత ప్రమాణాలతో సిద్ధం చేయాలని సూచించారు. ఓపీ కౌంటర్లు, రిజిస్ట్రేషన్ కౌంటర్లు, హెల్ప్ డెస్క్‌లు, ఫార్మసీ సేవలు, వెయిటింగ్ ఏరియాలను మరింత పటిష్టంగా ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ, డిజిటల్ ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్ తదితర ఆధునిక యంత్రాలు పూర్తిస్థాయిలో రోగులకు అందుబాటులో ఉండేలా అవసరమైన డాక్టర్లు, టెక్నీషియన్లు, సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని అధికారులకు ఆదేశించారు.

సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ కార్డియాక్ కేర్

గుండె సంబంధిత వ్యాధుల చికిత్సలు, అవయవ మార్పిడి శస్త్రచికిత్సలకు ఈ హాస్పిటల్‌ను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా తీర్చిదిద్దుతున్నామని మంత్రి పేర్కొన్నారు. క్యాథ్‌ల్యాబ్‌లు, ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ సదుపాయాలు, అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. పేదలకు కార్పొరేట్ స్థాయి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందించాలన్న సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యానికి అనుగుణంగా సనత్‌నగర్ టిమ్స్ హాస్పిటల్‌ను అభివృద్ధి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు ప్రపంచస్థాయి వైద్య సేవలు అందించగల అత్యుత్తమ వైద్య సంస్థగా టిమ్స్ నిలవాలని అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. రోగులతో పాటు వారి సహాయకులకు కూడా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని మంత్రి సూచించారు. ధర్మశాల, క్యాంటీన్లు, పార్కింగ్ సదుపాయాలు, హాస్టల్ బ్లాకులు, ఇతర సహాయక సేవలను కూడా సమగ్రంగా అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ నిర్వహణ, వైద్య సేవలు, మానవ వనరులు, నాన్ మెడికల్ సర్వీసులు, భద్రత, పారిశుధ్యం తదితర అంశాలపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించి అవసరమైన సూచనలు చేశారు. సమావేశంలో ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తు, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరేంద్ర కుమార్, నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, ఆర్ అండ్ బీ, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

Next Story