- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెట్రో బంద్ కావడంతో కూలీల మాదిరిగా లారీలు ఎక్కిన టెకీలు
బెంగళూరులో మెట్రో బ్రేక్‌డౌన్‌తో కవాడంతో ఇళ్లకు వెళ్లేందుకు లారీలు ఎక్కిన ఐటీ ఉద్యోగులు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎంపీ తేజస్వీ సూర్య తీవ్ర ఆగ్రహం.

దిశ, వెబ్ డెస్క్: భారతదేశ సిలికాన్ వ్యాలీ గా పిలవబడే బెంగళూరు నగరంలో నిన్న రాత్రి ఊహించని సంఘటన చోటు చేసుకుంది. మంగళవారం సాయంత్రం పీక్ అవర్స్‌లో 'నమ్మ మెట్రో' పర్పుల్ లైన్‌లోని కబ్బన్ పార్క్ స్టేషన్ వద్ద హఠాత్తుగా సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆఫీసులు ముగించుకుని ఇళ్లకు వెళ్లే వేలాది మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, ప్రయాణికులు నడిరోడ్డుపై నిలిచిపోయారు. క్యాబ్‌లు దొరక్క, ఆటోల వారు నిరాకరించడంతో గమ్యస్థానాలకు చేరుకోవడానికి వేరే మార్గం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఐటీ ప్రొఫెషనల్స్ రోడ్డుపై వెళ్లే లారీలు, ఓపెన్ ట్రక్కులు (టిప్పర్లు) ఎక్కి ప్రయాణించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండటంతో బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వి సూర్య స్థానిక కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
"ఫస్ట్ వరల్డ్ టెక్ టాలెంట్.. థర్డ్ వరల్డ్ గవర్నెన్స్ (అత్యుత్తమ సాంకేతిక ప్రతిభ.. అధమ స్థాయి పాలన).. ఇదే నేటి బెంగళూరు కథ" అంటూ తేజస్వీ సూర్య తన ట్వీట్‌లో మండిపడ్డారు. నగరంలో మెట్రో అంతరాయాలు ఇటీవల కాలంలో ఆందోళనకరంగా పెరిగిపోయాయని, ప్రతిసారి మెట్రో విఫలమైనప్పుడు యావత్ నగరం అతలాకుతలమవుతోందని ధ్వజమెత్తారు. భారతదేశ సిలికాన్ వ్యాలీలో రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసే ప్రొఫెషనల్స్.. నిన్న రాత్రి ఇళ్లకు చేరుకోవడానికి లారీలు, ట్రక్కులను ఆశ్రయించాల్సి రావడం సిగ్గుచేటన్నారు. వీరంతా రేపు ఉదయాన్నే మళ్లీ లేచి, ఆఫీసులకు వెళ్లి, ప్రభుత్వానికి సక్రమంగా పన్నులు చెల్లిస్తారని.. కానీ ప్రతిఫలంగా ఇలాంటి విఫలమైన వ్యవస్థను అనుభవించాల్సి రావడం దారుణమని ఆయన దుయ్యబట్టారు. ఐటీ కారిడార్‌ను పక్షవాతంలా మార్చిన ఈ వ్యవస్థాగత లోపాలపై కర్ణాటక ప్రభుత్వం, బీఎంఆర్‌సీఎల్ (BMRCL) తక్షణమే సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.






