- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మీరు బాగా చదవాలి.. లేదంటే సీఎం నాకు మైనస్ మార్కులు వేస్తారు.. మంత్రి లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు
సమాజంలో మార్పు తెచ్చేందుకే నేను అత్యంత కఠినమైన విద్యాశాఖను ఎంచుకున్నానని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: సమాజంలో మార్పు తెచ్చేందుకే నేను అత్యంత కఠినమైన విద్యాశాఖను ఎంచుకున్నానని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిని నేను ఛాలెంజ్‌గా స్వీకరించాను.. విద్యావ్యవస్థలో మార్పు తేవడం ఉపాధ్యాయుల సహకారంతోనే సాధ్యమవుతుంది.. దేశంలోనే ఆదర్శవంతంగా ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ తీసుకురావాలన్నది నా ధ్యేయం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, అధికారుల సమష్టి కృషితోనే ఇది సాధ్యమవుతుందన్నారు. అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి మండలం కొక్కిలిగడ్డలో పీ4 పథకంలో భాగంగా దాతల సహకారంతో రూ.1.4కోట్లతో నూతనంగా నిర్మించిన జెడ్పీ హైస్కూల్ నూతన భవనాలను మంత్రి లోకేశ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేశ్ కొక్కిలిగడ్డ హైస్కూలు ఉపాధ్యాయులతో మాట్లాడుతూ... గత రెండేళ్లలో విద్యావ్యవస్థలో సంస్కరణలన్నీ పూర్తి చేశాం, ఇక ఉపాధ్యాయులంతా పూర్తిగా ఫలితాలపైనే శ్రద్ధ వహించాలని సూచించారు. నేను విద్యామంత్రిగా బాధ్యతలు చేపట్టాక పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపర్చాం. కొక్కిలిగడ్డ హైస్కూలులో లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్ తప్ప అన్ని సౌకర్యాలు కల్పించాం. అభ్యసనా ఫలితాల మెరుగుదలపై ఉపాధ్యాయులు శ్రద్ధ వహించాలి. ఫార్మేటివ్, సమ్మెటివ్ టెస్ట్ ఫలితాల ఆధారంగా విద్యార్థుల సామర్థ్యాన్ని మెరుగుపర్చాలి. వెనుకబడిన విద్యార్థుల పనితీరును మెరుగుపర్చేందుకు బ్రిడ్జి కోర్సు మెటీరియల్ ను అందజేస్తాం. వివిధ తరగతుల్లో వెనుకబడిన పిల్లలు ఏ సబ్జెక్టుల్లో బలహీనంగా ఉన్నారో తెలుసుకొని, అటువంటి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్డండి. నూరు శాతం ఫలితాలే లక్ష్యంగా ఉపాధ్యాయులు పనిచేయాలన్నారు.
తొలిసారిగా ప్రభుత్వ స్కూళ్ల ఫలితాలతో యాడ్స్
గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థుల చిత్రాలతో పత్రికల్లో యాడ్స్ ఇచ్చామని మంత్రి లోకేశ్ చెప్పారు. గత విద్యా సంవత్సరంలో మంచి ఫలితాలు వచ్చాయి. ఉపాధ్యాయులు తమ రోజువారీ విధినిర్వహణలో ఏదైనా సమస్య తలెత్తితే మీరు ఎంఇఓ, డీఇఓలకు వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు, లీప్ యాప్ ద్వారా నేరుగా నాకు చెప్పొచ్చు. వచ్చేనెల 16,17,18 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా పేరెంట్-టీచర్ మీటింగ్ సమావేశాలను నిర్వహించాలని భావిస్తున్నాం. ఉపాధ్యాయులంతా చొరవ తీసుకొని తల్లిదండ్రులను చైతన్యపర్చి లీప్ యాప్ డౌన్ లోడ్ చేయించండి. విద్యావ్యవస్థలో నేను అనుకున్నది సాధించాలంటే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, అధికారుల సహకారం అవసరం. అందరి సమిష్టికృషితోనే అత్యుత్తమ ఫలితాలు రాబట్టగలుగుతాం. అందరం టీమ్ వర్క్‌గా పనిచేసి ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ సాధిద్దాం.. అని వివరించారు.
మీరు చదవకపోతే నాకు మైనస్ మార్కులు!
విద్యార్థులు బాగా చదివి మంచి ఫలితాలు సాధిస్తే ముఖ్యమంత్రి నాకు మంచి మార్కులు వేస్తారు, మీరు సరిగా చదవకపోతే ఆయన నాకు మైనస్ మార్కులు వేస్తారు, నా భవిష్యత్తు మీపై ఆధారపడి ఉందని మంత్రి లోకేశ్ చమత్కరించారు. ఈ సందర్భంగా 9,10 తరగతుల విద్యార్థులతో మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. మీ సౌకర్యం, మీ భవిష్యత్తు కోసం దాతలు అద్భుతంగా కొత్త భవనాలను నిర్మించారు. విద్యార్థులంతా కష్టపడి చదివి పాస్ పర్సంటేజిని పెంచాలి. ఇప్పటికే విద్యార్థులకు యూనిఫాం, పుస్తకాలు ఇచ్చాం, త్వరలోనే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా కిట్స్, బూట్లు అందజేస్తాం. విద్యార్థులు శ్రద్ధగా చదివి మంచిమార్కులతో మెరుగైన ఫలితాలు సాధించాలి. విద్యార్థుల పనితీరును ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు లీప్ యాప్‌ను రూపొందించాం. నా గురువుల వల్లే ప్రస్తుతం నేను ఈ స్థాయికి చేరుకున్నాను. విద్యార్థులు ఉపాధ్యాయులను గౌరవిస్తూ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మంత్రి లోకేశ్ ఆకాంక్షించారు. మంత్రి వెంట రాష్ట్ర కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్ తదితరులు ఉన్నారు.






