ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో వైద్య పరికరాల మరమ్మత్తు శిబిరం

by Kodari Anjali |

సమాజ సేవ, మానవతా విలువలను చాటిచెప్పే మరో విశిష్ట కార్యక్రమానికి అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ హైదరాబాద్‌కు చెందిన వృద్ధుల విభాగం మజ్లిస్ అన్సారుల్లాహ్ శ్రీకారం చుట్టింది.

ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో వైద్య పరికరాల మరమ్మత్తు శిబిరం
X

దిశ, చంపాపేట్: సమాజ సేవ, మానవతా విలువలను చాటిచెప్పే మరో విశిష్ట కార్యక్రమానికి అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ హైదరాబాద్‌కు చెందిన వృద్ధుల విభాగం మజ్లిస్ అన్సారుల్లాహ్ శ్రీకారం చుట్టింది. ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో జూన్ 22 నుంచి 24 వరకు నిర్వహించిన వైద్య పరికరాల మరమ్మత్తు మరియు నిర్వహణ శిబిరం విజయవంతంగా ముగిసింది. శిబిరంలో మరమ్మత్తు చేసిన పరికరాలను బుధవారం ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు అధికారికంగా అప్పగించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ శిబిరంలో వీల్‌చైర్లు, స్ట్రెచర్లు, రోగుల పడకలు, ఇతర సహాయక వైద్య పరికరాలను పరిశీలించి అవసరమైన మరమ్మత్తులు చేపట్టారు. దీంతో పరికరాల వినియోగ సామర్థ్యం పెరగడంతో పాటు ఆసుపత్రి వనరుల సమర్థ వినియోగానికి దోహదం కానుంది. ఈ సందర్భంగా మజ్లిస్ అన్సారుల్లాహ్ హైదరాబాద్ అధ్యక్షుడు ముహమ్మద్ జియావుద్దీన్ మాట్లాడుతూ, రోగుల సంక్షేమం కోసం అవసరమైన వైద్య పరికరాలను మరమ్మత్తు చేసి తిరిగి వినియోగంలోకి తీసుకురావడం తమ సామాజిక బాధ్యతలో భాగమని తెలిపారు.

కమ్యూనిటీకి అనుబంధంగా పనిచేస్తున్న...

“అందరినీ ప్రేమించు – ఎవ్వరినీ ద్వేషించకు” అనే తమ నినాదాన్ని కార్యరూపంలో చూపించడానికే ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టామని పేర్కొన్నారు. మానవాళికి కరుణ, దయ, నిస్వార్థ సేవలందించడమే తమ లక్ష్యమని అన్నారు. అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ ప్రపంచవ్యాప్తంగా శాంతి, సామరస్యం, సోదరభావం, మానవతా విలువలను ప్రోత్సహిస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థగా గుర్తింపు పొందింది. కమ్యూనిటీకి అనుబంధంగా పనిచేస్తున్న హ్యూమానిటీ ఫస్ట్ సంస్థ ప్రకృతి విపత్తులు, అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు ఆహారం, తాగునీరు, వైద్య సహాయం, పునరావాస సేవలు అందిస్తూ విశేష సేవలు అందిస్తోంది. ప్రస్తుతం కమ్యూనిటీ ప్రపంచాధ్యక్షుడు, ఐదవ ఖలీఫా హజ్రత్ మీర్జా మస్రూర్ అహ్మద్ నాయకత్వంలో 210కు పైగా దేశాల్లో శాంతి, సమానత్వం, న్యాయం, దేశభక్తి, కరుణ, సోదరభావం వంటి విలువలను ప్రచారం చేస్తూ మానవసేవా కార్యక్రమాలను కొనసాగిస్తోంది.

Next Story