విద్యార్థుల సమస్యలపై కేంద్రాన్ని నిలదీస్తాం

by velandi.Saikiran |

విద్యార్థుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని సంగీతం శ్రీనివాస్ డిమాండ్ చేశారు.

విద్యార్థుల సమస్యలపై కేంద్రాన్ని నిలదీస్తాం
X

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల: దేశంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న నిరుద్యోగం, విద్యార్థుల ఆత్మహత్యలు, విద్యా వ్యవస్థలోని లోపాలు యువత భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయన్నారు. రాజస్థాన్‌లోని కోటాలో వరుసగా చోటుచేసుకుంటున్న విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విద్యార్థులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారని పేర్కొన్నారు. విద్యా వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు చేపట్టడం ద్వారా విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించవచ్చని రాహుల్ గాంధీ సూచించినట్లు తెలిపారు. యువత భవిష్యత్తు రక్షణ కోసం ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత సమాజంపై ఉందన్నారు.

ఇటీవల జరిగిన నీట్ పరీక్ష వ్యవహారం దేశ విద్యా వ్యవస్థలోని లోపాలను బయటపెట్టిందని శ్రీనివాస్ విమర్శించారు. నీట్, జేఈఈ, యూపీఎస్సీ, ఆర్ఆర్బీ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు విద్యార్థుల కుటుంబాలు భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నాయని, ఇది కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారం మోపుతోందన్నారు. నీట్ పరీక్షకు సంబంధించిన పేపర్ లీకేజీ ఘటన దేశవ్యాప్తంగా ఆందోళనకు దారితీసిందని, దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని కోరారు. పోటీ పరీక్షల్లో లక్షలాది మంది యువత పాల్గొంటున్నప్పటికీ కొద్దిమందికే ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని, మిగిలిన వారు అసంఘటిత రంగంలో పనిచేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎన్‌ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Next Story