- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేసిఆర్ అప్పులు చెల్లిస్తూనే సంక్షేమ పథకాలు అమలు
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పదేళ్ల పాలనలో చేసిన అప్పులకు సంబంధించి అసలు వడ్డీ చెల్లిస్తూనే ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

దిశ, వైరా : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పదేళ్ల పాలనలో చేసిన అప్పులకు సంబంధించి అసలు వడ్డీ చెల్లిస్తూనే ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. పదేళ్లపాటు అడ్డగోలుగా రాష్ట్రాన్ని దోచుకున్న కేసీఆర్ కొడుకు, అల్లుడు, కూతురు రాష్ట్రంలో తిరుగుతూ గాలి కబుర్లు గాలి మాటలు చెబుతున్నారని విమర్శించారు. వైరాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చింతకాని మండలం జగన్నాధపురం గ్రామంలో ఈనెల 30వ తేదీన నిర్వహించనున్న రైతు ఆశీర్వాద మహాసభను విజయవంతం చేయాలని కోరుతూ బుధవారం నియోజకవర్గస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఎలాంటి టెక్నాలజీ అందుబాటులో లేని1967 సంవత్సరంలో ప్రారంభమైన నాగార్జునసాగర్, ఎస్సారెస్పీ ప్రాజెక్టులు చెక్కుచెదరకుండా లక్షలాది ఎకరాలకు నేటికీ సాగునీరు అందిస్తున్నాయని పేర్కొన్నారు. అయితే టెక్నాలజీ ఉన్న సమయంలో బీఆర్ఎస్ నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టు రెండు సంవత్సరాలకే కుంగి పోయిందని చెప్పారు.
ఈ ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్ కుటుంబం లక్ష కోట్ల అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. పాలన అంటే బీఆర్ఎస్ హయాంలో మాదిరిగా నలుగురు మనుషులు దోచుకోవటం కాదని, నాలుగు కోట్ల ప్రజలకు మేలు చేయటం అన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కేసీఆర్ కుమార్తె చెబుతుంటే ఆ కుటుంబ సభ్యులు తల ఎత్తుకొని ఎలా బయటికి వస్తున్నారని ఎద్దేవా చేశారు. సొంత పేపర్, సోషల్ మీడియాలో అడ్డగోలు అబద్ధాలు చెబుతూ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కెసిఆర్ చేసిన రూ. 8 లక్షల కోట్ల అప్పుకు సంబంధించి ప్రతి సంవత్సరం అసలు వడ్డీ 76 వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం ఒకవైపు చెల్లిస్తూనే, మరో వైపు సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని వివరించారు. ప్రజలకు సన్న బియ్యం, ఇందిరమ్మ ఇల్లు, గృహాలకు ఉచిత కరెంట్, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, నిరుద్యోగులకు 76 వేల ఉద్యోగాల కల్పన, మహిళలకు బ్యాంకు లింకేజీ రుణాలు తదితర పథకాలను అమలు చేస్తున్నామని వివరించారు. అతి త్వరలో ఇందిరమ్మ కుటుంబ బీమా, ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు అల్పాహారం పథకాలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. అదేవిధంగా ఎస్ఐఆర్ పట్ల కాంగ్రెస్ నాయకులు బిఎల్ఎలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోషల్ మీడియా ను ఏఐతో అనుసంధానం చేసి కేంద్ర ప్రభుత్వం తమ వ్యతిరేక ఓట్లను జాబితా నుంచి తొలగించేందుకు కుట్ర చేస్తుందని ఆరోపించారు.
చింతకాని మండలం జగన్నాధపురం గ్రామంలో నిర్వహించే రైతు ఆశీర్వాద మహాసభకు వైరా నియోజకవర్గ నుంచి అత్యధిక సంఖ్యలో రైతులు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో గడిచిన రెండున్నరేళ్లలో పలు పథకాల ద్వారా రైతుల ఖాతాలో 1.15 లక్షల కోట్ల రూపాయలను జమ చేశామని చెప్పారు.. భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో 2.5 కోట్ల మెట్రిక్ టన్నుల పంటను పండించారని పేర్కొన్నారు. ఎలినో ప్రభావం దక్షిణ భారతదేశంలోని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలపై అత్యధికంగా ఉండవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, వైరా మున్సిపాలిటీ చైర్ పర్సన్ కాపా చంద్రకళ, కాంగ్రెస్ వైరా మండల అధ్యక్షుడు శీలం వెంకట నర్సిరెడ్డి, కిసాన్ కేత్ రాష్ట్ర నాయకులు దాసరి దానియేలు, నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.






