మత్తు వ్యసనాలకు దూరంగా ఉండాలి : ఎస్పీ

by Taduka Kalyani |

మత్తు వ్యసనాలకు దూరంగా ఉండి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని జిల్లా ఎస్పీ డీ. వి శ్రీనివాసరావు వెల్లడించారు.

మత్తు వ్యసనాలకు దూరంగా ఉండాలి : ఎస్పీ
X

దిశ, నర్సాపూర్ : మత్తు వ్యసనాలకు దూరంగా ఉండి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని జిల్లా ఎస్పీ డీ. వి శ్రీనివాసరావు వెల్లడించారు. మత్తు పదార్థాల వ్యసనం నుంచి బయటపడేందుకు చికిత్స పొందుతున్న వారికి ప్రోత్సాహం అందించేందుకు మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్ నర్సాపూర్‌లోని డి-అడిక్షన్ సెంటర్‌ను బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా చికిత్స పొందుతున్న బాధితులతో ఎస్పీ మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి, చికిత్స పురోగతి గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మత్తు వ్యసనాన్ని పూర్తిగా విడిచిపెట్టి కుటుంబ సభ్యుల అండతో సమాజంలో గౌరవ ప్రదమైన జీవితాన్ని గడపాలని సూచించారు. మానసిక దృఢత్వం, సంకల్పంతో వ్యసనం నుంచి పూర్తిగా బయటపడవచ్చని, వైద్యులు, కౌన్సిలర్ల సూచనలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. బాధితుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ఎస్పీ క్యారం, చెస్ బోర్డులను పంపిణీ చేశారు. అలాగే వారికి స్నాక్స్ అందజేసి ఆప్యాయంగా పలకరించారు. క్రీడలు, మేధోపరమైన ఆటలు మానసిక ప్రశాంతతను కలిగించి వ్యసనాల నుంచి దూరంగా ఉండేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు. డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని అన్నారు. పరిసరాల్లో ఎవరైనా మత్తు పదార్థాల విక్రయం లేదా వినియోగానికి పాల్పడుతున్నట్లు తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. వ్యసనానికి బానిసైన వారికి చికిత్స, కౌన్సిలింగ్ ద్వారా కొత్త జీవితాన్ని అందించడమే పోలీసు శాఖ లక్ష్యమని, అదే సమయంలో మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. డ్రగ్స్ రహిత మెదక్ జిల్లా నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, నర్సాపూర్ ఎస్‌ఐ రంజిత్ రెడ్డి, డి-అడిక్షన్ సెంటర్ నిర్వాహకురాలు అభర్ణ, వైద్య సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Next Story