దిశ ఎఫెక్ట్ : ఖాజాగూడ చెరువు బఫర్ జోన్ నిర్మాణాలపై ఇరిగేషన్ శాఖ చర్యలు

by Taduka Kalyani |

ఖాజాగూడ చెరువుకు ముప్పు.. ఆ మూడు శాఖల అధికారుల మౌనం' శీర్షికన దిశలో ప్రచురితమైన కథనానికి నీటిపారుదల శాఖ అధికారులు స్పందించారు.

దిశ ఎఫెక్ట్ : ఖాజాగూడ చెరువు బఫర్ జోన్ నిర్మాణాలపై ఇరిగేషన్ శాఖ చర్యలు
X

దిశ, శేరిలింగంపల్లి: ఖాజాగూడ చెరువుకు ముప్పు.. ఆ మూడు శాఖల అధికారుల మౌనం' శీర్షికన దిశలో ప్రచురితమైన కథనానికి నీటిపారుదల శాఖ అధికారులు స్పందించారు. ఖాజాగూడ చెరువు బఫర్ జోన్‌లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై విచారణ చేపట్టి, రెవెన్యూ శాఖ అధికారులకు లేఖ రాశారు. నీటిపారుదల శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజశేఖర్, అసిస్టెంట్ ఇంజనీర్ వీణతో కలిసి ఖాజాగూడ చెరువు పరిసర ప్రాంతాలను పరిశీలించారు. పరిశీలనలో 'పెద్ద చెరువు' బఫర్ జోన్ పరిధిలో అక్రమ భవన నిర్మాణాలు జరుగుతున్నట్లు నిర్ధారించారు. దీంతో వాటిపై తగిన చర్యలు తీసుకోవాలని శేరిలింగంపల్లి తహసీల్దార్‌కు లేఖ పంపించారు.

చట్ట ఉల్లంఘనే: ఇరిగేషన్ అధికారులు

సంబంధిత అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థలాన్ని పరిశీలించి, ఖాజాగూడ చెరువు (ఐడీ నంబర్-3730) బఫర్ జోన్‌లో నిర్మాణ పనులు జరుగుతున్నట్లు గుర్తించారు. తెలంగాణ ఇరిగేషన్ చట్టం-1357 ఎఫ్‌లోని సెక్షన్-48 ప్రకారం జలవనరులు, నాలాలు (కాలువలు) మరియు వాటి భౌగోళిక స్వరూపంలో ఎలాంటి మార్పులు చేయడం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. అలాగే 2012 ఏప్రిల్ 7న అమలులోకి వచ్చిన జీఓ ఎంఎస్ నంబర్ 168 ప్రకారం బఫర్ జోన్ ప్రాంతాల్లో ఎటువంటి శాశ్వత నిర్మాణాలకు అనుమతి లేదని స్పష్టం చేస్తూ నోటీసులు జారీ చేశారు.

బఫర్ జోన్‌లోనే భవన అనుమతులు

ఖాజాగూడ చెరువు బఫర్ జోన్ పరిధిలో ఉన్న స్థలానికి 2026 ఫిబ్రవరి 4న భవన నిర్మాణ అనుమతులు మంజూరైనట్లు ఇరిగేషన్ అధికారులు గుర్తించారు. ఫైల్ నంబర్ 039202/GHMC/11492/IABPC49/2026 ఆధారంగా అప్పటి డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి, ఏసీపీ వెంకట్ రమణ టీపీఎస్ విభాగం ద్వారా అనుమతులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. అలాగే డిప్యూటీ కమిషనర్ స్థల పరిశీలన చేయకుండా, అది బఫర్ జోన్ పరిధిలో ఉందో లేదో నిర్ధారించకుండా దరఖాస్తుదారునికి పర్మిట్ నంబర్ 0047/CMC/IA/C49/2026 (తేదీ: 25-02-2026)తో మరో నిర్మాణానికి అనుమతి జారీ చేసినట్లు రెవెన్యూ శాఖకు పంపిన లేఖలో వెల్లడించారు.

విజిలెన్స్ విచారణకు డిమాండ్

బఫర్ జోన్‌లో నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేసిన అధికారులపై విజిలెన్స్ విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పర్యావరణ పరిరక్షణ వాదులు డిమాండ్ చేస్తున్నారు. కొందరు అధికారులు నిబంధనలను పట్టించుకోకుండా అనుమతులు మంజూరు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయని, ఇలాంటి వ్యవహారాలపై కఠిన చర్యలు అవసరమని వారు అభిప్రాయపడుతున్నారు.

Next Story