డ్రెస్సింగ్ రూంలోకి వైభవ్‌కు నో ఎంట్రీ!.. ఎందుకో తెలుసా?

by Harish |

డ్రెస్సింగ్ రూంలోకి వైభవ్‌కు నో ఎంట్రీ!.. ఎందుకో తెలుసా?
X

దిశ, స్పోర్ట్స్ : భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్ టూరుకు ఎంపికైన విషయం తెలిసిందే. అయితే ఆ టూరులో 15 ఏళ్ల వైభవ్ భారత ప్లేయర్లతో కలిసి డ్రెస్సింగ్ రూం పంచుకునే అవకాశం లేదట. ఐసీసీ, ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) నిబంధనలే అందుకు కారణమని క్రికెట్ వర్గాలు తెలిపాయి. ఐసీసీ, ఈసీబీ బాలల భద్రతా నిబంధనల ప్రకారం.. 16 ఏళ్ల లోపు ప్లేయర్లు సీనియర్ ప్లేయర్లతో కలిసి డ్రెస్సింగ్ రూంను పంచుకోవడానికి అనుమతి లేదు. దీంతో వైభవ్‌కు ఈసీబీ ప్రత్యేకంగా ఓ రూంను కేటాయించనున్నట్టు తెలుస్తోంది. ‘మ్యాచ్ సమయంలో అతను డ్రెస్సింగ్ రూంకు వెళ్లొచ్చు. కానీ, మ్యాచ్‌కు ముందు, మ్యాచ్ తర్వాత డ్రెస్సింగ్ రూంలోకి అనుమతి లేదు. అతనికి ప్రత్యేకంగా కేటాయించిన గదిని మాత్రమే ఉపయోగించుకోవాల్సి ఉంటుంది.’అని క్రికెట్ వర్గాలు తెలిపాయి. వైభవ్‌తోపాటు ప్రయాణించడానికి, అతనితో కలిసి ఉండటానికి బీసీసీఐ అతని తల్లిదండ్రులకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. వారికి కూడా వసతి సదుపాయం కల్పించనున్నట్టు క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, భారత డ్రెస్సింగ్ రూంలోకి వైభవ్ అనుమతి గురించి బీసీసీఐ అధికారులు ఈసీబీ ప్రతినిధులతో చర్చించే అవకాశం ఉంది. ఇంగ్లాండ్ టూరుకు ముందే వైభవ్ ఐర్లాండ్‌పై అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ఈ నెల 26న భారత్, ఐర్లాండ్ మధ్య తొలి టీ20 జరగనుంది.


Next Story