తుంగభద్ర జలాలపై కేంద్రం జోక్యం చేసుకోవాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2026-06-24 15:40:31  IST  )

తుంగభద్ర జలాలపై కేంద్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి కీలక విజ్ఞప్తి చేశారు.

తుంగభద్ర జలాలపై కేంద్రం జోక్యం చేసుకోవాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తుంగభద్ర నది నీటి వాటాలో తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కేంద్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచారు. అంతర్రాష్ట్ర జల వివాదంలో కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇవాళ నగరంలో జలసౌధలో నిర్వహించిన నీటిపారుదల శాఖ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తుంగభద్ర బోర్డు (Tungabhadra Board) పరిధిలో తెలంగాణకు చట్టబద్ధంగా దక్కాల్సిన నీటిని కేటాయించడంలో తీవ్ర వివక్ష జరుగుతోందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం తెలంగాణకు 15.9 టీఎంసీల తుంగభద్ర జలాలు రావాలని తెలిపారు. కానీ ప్రస్తుతం క్షేత్రస్థాయిలో కేవలం 5 నుంచి 6 టీఎంసీలు మాత్రమే అందుతున్నాయి. మిగిలిన నీటిని పొరుగు రాష్ట్రాలు వాడుకుంటుంటే మన రైతులకు అన్యాయం జరుగుతోందని అన్నారు. అందుకే తుంగభద్ర బోర్డును మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉంని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నీటి పంపిణీ సక్రమంగా, పారదర్శకంగా జరగాలంటే 2004 నిపుణుల కమిటీ చేసిన సూచనలను తక్షణమే అమలు చేయాలని ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

రూ.59 కోట్లు ఇచ్చినా ఆర్డీఎస్ పనులు కాలే..

ఉమ్మడి మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లాకు జీవనాడి అయిన రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (RDS) కింద 83,987 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉందని, కానీ పనులు నత్తనడకన సాగడంపై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం తరపున రూ.59 కోట్లు డిపాజిట్ చేసినప్పటికీ ఇప్పటికీ ఆర్డీఎస్ పనులు పూర్తి కాలేదని ధ్వజమెత్తారు. ఆర్డీఎస్ ఆనకట్ట దగ్గర పేరుకుపోయిన పూడికను తక్షణమే తీయడానికి ఉమ్మడి చర్యలు చేపట్టాలని, పెండింగ్‌లో ఉన్న ప్యాకేజీ 1, 2 పనులను యుద్ధప్రాతిపదికన ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.

అదేవిధంగా మహబూబ్‌నగర్ రైతాంగానికి పూర్తి స్థాయిలో నీరు చేరాలంటే మల్లమ్మకుంట రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. అదేవిధంగా తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం (Tumilla Lift Irrigation) పనులలో వేగం పెంచాలని, క్షేత్రస్థాయిలో ఎలాంటి జాప్యం జరగకుండా నిరంతరం పర్యవేక్షించాలని నీటిపారుదల శాఖ ఇంజినీర్లను, ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

Next Story