- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాదకద్రవ్యాల రహిత సమాజం కోసం సమిష్టి కృషి: గవర్నర్‌తో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ భేటీ
మాదకద్రవ్యాల రహిత సమాజం, వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమంపై గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాతో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ భేటీ అయ్యారు.

దిశ, తెలంగాణ బ్యూరో: మాదకద్రవ్యాల రహిత తెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో మాదకద్రవ్యాల నిర్మూలన, వృద్ధుల సంక్షేమం, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్ల సాధికారతపై చర్చించేందుకు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బుధవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాతో భేటీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'నషా ముక్త్ భారత్ అభియాన్'లో భాగంగా రాష్ట్రంలో చేపడుతున్న నిరోధక చర్యలు, యువతలో అవగాహన కల్పించేందుకు చేస్తున్న కృషిని ఈ సందర్భంగా మంత్రి గవర్నర్‌కు వివరించారు.
అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ ఏర్పాట్లు..
ఈ నెల 26న నిర్వహించనున్న అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టబోయే ర్యాలీలు, ప్రతిజ్ఞా కార్యక్రమాలు, యువజన చైతన్య కార్యక్రమాల గురించిన ఒక సమగ్ర నివేదికను మంత్రి గవర్నర్‌కు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాల్సిందిగా మంత్రి కోరగా.. జూన్ 26న ముందస్తు అధికారిక కార్యక్రమాల వల్ల తాను హాజరుకాలేకపోతున్నట్లు గవర్నర్ తెలిపారు. అయితే, జూలై 2న వరంగల్ జిల్లాలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. మాదకద్రవ్యాల కట్టడికి విద్యాసంస్థలు, తల్లిదండ్రులు, స్వచ్ఛంద సంస్థలు, పోలీసు శాఖ మధ్య బలమైన సమన్వయం ఉండాలని గవర్నర్ సూచించారు.
బలహీన వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యత..
ఈ సమావేశంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దివ్యాంగుల సాధికారతలో భాగంగా రాష్ట్రంలో అమలవుతున్న ‘బాల భరోసా’ పథకం, సహాయక పరికరాల పంపిణీ, ప్రత్యేక పాఠశాలల నిర్వహణపై చర్చించారు. అలాగే వృద్ధుల సమస్యల పరిష్కారం, ‘ప్రణామ్’ డే కేర్ కేంద్రాల సేవలు, ట్రాన్స్‌జెండర్ల సామాజిక, ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం చేపడుతున్న నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ చర్యలను ప్రశంసించిన గవర్నర్.. సమాజంలోని అత్యంత బలహీన వర్గాల అభ్యున్నతికి, వారు గౌరవప్రదమైన జీవనం సాగించడానికి మరింత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ ఉన్నత స్థాయి భేటీలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.దాన కిషోర్, అధికారులైన అనితా రామచంద్రన్, బి.శైలజ తదితరులు పాల్గొన్నారు.






