- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
E20 Fuel: ఈ20 పెట్రోల్‌పై అపోహలకు బ్రేక్
ఈ20 ఇంధనం ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇథనాల్ మిశ్రమం కారణంగా దేశవ్యాప్తంగా ఇంజిన్ ఫెయిల్యూర్ లేదా వాహనాల పనితీరులో పెద్ద ఎత్తున సమస్యలు నమోదైన దాఖలాలు లేవని స్పష్టం చేసింది.

దిశ, బిజినెస్ బ్యూరో: ఇథనాల్ కలిపిన ఈ20 పెట్రోల్‌పై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తోసిపుచ్చింది. ఈ20 వాడితే ఇంజిన్ దెబ్బతింటుందని, వాహనాలు మధ్యలో ఆగిపోతాయని, ఇన్సూరెన్స్ పాలసీలు చెల్లవని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పెట్రోలియం మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. ఈ20 ఇంధనం ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇథనాల్ మిశ్రమం కారణంగా దేశవ్యాప్తంగా ఇంజిన్ ఫెయిల్యూర్ లేదా వాహనాల పనితీరులో పెద్ద ఎత్తున సమస్యలు నమోదైన దాఖలాలు లేవని స్పష్టం చేసింది. చమురు మార్కెటింగ్ కంపెనీలు, వాహన తయారీ సంస్థలు, పరీక్షా సంస్థలతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపింది. ముడి చమురు దిగుమతులను తగ్గించడం, ఇంధన భద్రతను పెంచడం, కాలుష్యాన్ని తగ్గించడం లక్ష్యంగా భారత్ 2003లో ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించగా, ఈ20 పెట్రోల్‌ను 2023లో దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టింది.
ఇంధన ట్యాంక్ దగ్గర చీమలు ఉన్న ఒక వైరల్ వీడియోపై స్పందిస్తూ.. పెట్రోల్‌లో నేరుగా చెరకు రసం కలుపుతున్నారనే వింత ఆరోపణలను భారత్ పెట్రోలియం (బీపీసీఎల్), చమురు మంత్రిత్వ శాఖ కొట్టిపారేశాయి. ఇథనాల్‌ను చెరకు రసం, మొక్కజొన్న, విరిగిన బియ్యం నుంచి తయారు చేసినప్పటికీ.. కిణ్వ ప్రక్రియ (ఫర్మంటేషన్), స్వేదనం (డిస్టిలేషన్) వంటి శాస్త్రీయ పద్ధతుల ద్వారా చివరగా వాడే ఉత్పత్తిలో ఎక్కడా చక్కెర శాతం మిగలకుండా పూర్తిగా తొలగిస్తారని వివరించారు. పైగా, ఈ ఫ్యూయల్-గ్రేడ్ ఇథనాల్‌లో కీటకాలను దూరంగా ఉంచే రసాయనాలు ఉంటాయి కాబట్టి చీమలను ఆకర్షించే అవకాశమే లేదని ప్రభుత్వం వివరించింది. ఇక ఈ20 వాడితే వాహన బీమా రద్దవుతుందన్న వాదనలను కూడా ఖండిస్తూ, ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడిన తర్వాతే ఈ క్లారిటీ ఇస్తున్నామని, పాలసీల చెల్లుబాటుపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేసింది.






