- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గజం లక్ష పలుకుతున్న స్థలం.. కబ్జాదారుల కళ్లల్లో బంగారు బాతు
నగర నడిబొడ్డున ఉన్న ఎంజీ రోడ్డులో గజం స్థలం లక్ష రూపాయలకు పైగా పలుకుతున్న నేపథ్యంలో ప్రజా స్థలాలపై అక్రమార్కుల కన్ను పడిందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

దిశ, లక్ష్మీదేవిపల్లి : నగర నడిబొడ్డున ఉన్న ఎంజీ రోడ్డులో గజం స్థలం లక్ష రూపాయలకు పైగా పలుకుతున్న నేపథ్యంలో ప్రజా స్థలాలపై అక్రమార్కుల కన్ను పడిందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. విలువైన భూములపై ఆశతో కొందరు ప్రభావశీలులు ప్రజల రాకపోకలకు కేటాయించిన వీధులు, ఫుట్‌పాత్‌లు, ఖాళీ స్థలాలను ఆక్రమిస్తూ తమ వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించుకుంటున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఒకప్పుడు చిన్నబజార్, పెద్దబజార్ ప్రాంతాలను అనుసంధానించిన ప్రజా మార్గాలు నేడు అక్రమ నిర్మాణాల మధ్య కనుమరుగవుతున్న పరిస్థితి నెలకొంది. ప్రజల కోసం ఉద్దేశించిన స్థలాల్లో మెట్లు, ర్యాంపులు, షెడ్లు నిర్మించి ఆక్రమణలకు పాల్పడుతున్నా అధికారులు మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. సాధారణ పేదవాడు చిన్నపాటి నిర్మాణం చేసినా వెంటనే నోటీసులు జారీ చేసే అధికారులు, గజం లక్షల విలువైన ప్రాంతాల్లో జరుగుతున్న భారీ ఆక్రమణల విషయంలో ఎందుకు మౌనం పాటిస్తున్నారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ప్రజా ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత ఉన్న యంత్రాంగమే ప్రేక్షక పాత్ర పోషిస్తుండటంతో ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఫుట్‌పాత్‌లు పూర్తిగా ఆక్రమించబడటంతో పాదచారులు ప్రాణాలను పణంగా పెట్టి రోడ్లపైనే నడవాల్సిన దుస్థితి ఏర్పడింది. రేపు ప్రమాదాలు జరిగితే బాధ్యత ఎవరిదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కోట్ల రూపాయల విలువైన ప్రజా భూములు కొందరి చేతుల్లోకి జారిపోతుంటే అధికారులు మౌనం వీడకపోవడం ప్రజాస్వామ్య వ్యవస్థకే మచ్చగా మారిందని సామాజిక వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా, మున్సిపల్ ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఎంజీ రోడ్డులోని ఆక్రమణలను గుర్తించి తొలగించాలని, ప్రజా స్థలాలను కబ్జాల నుంచి కాపాడాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. “ప్రజల కోసం ఉన్న రోడ్లు ప్రజలకే దక్కాలి… కబ్జాదారులకు కాదు” అని నగరవాసులు స్పష్టం చేస్తున్నారు.






