నాగులపల్లిలో తాగునీటి బోరు ధ్వంసం

by Ratna Kumari |

మండల పరిధిలోని నాగులపల్లి గ్రామంలో ఘోరం జరిగింది. గ్రామంలోని తాగునీటి సమస్యను తీర్చేందుకు గ్రామంలో వేసిన బోరు బావిని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.

నాగులపల్లిలో తాగునీటి బోరు ధ్వంసం
X

దిశ పెద్దేముల్: మండల పరిధిలోని నాగులపల్లి గ్రామంలో ఘోరం జరిగింది. గ్రామంలోని తాగునీటి సమస్యను తీర్చేందుకు గ్రామంలో వేసిన బోరు బావిని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పూర్తి వివరాల్లోకి వెళితే నాగులపల్లి గ్రామంలో గత కొన్ని రోజులుగా తీవ్ర తాగునీటి సమస్య వేధిస్తోంది. దీనిని పరిష్కరించేందుకు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల సమక్షంలో ఇటీవల ఒక బోరు బావిని డ్రిల్లింగ్ చేయించారు. అందులో మోటార్ బిగించి, ప్రజలకు నీటి సరఫరాను ప్రారంభించాలని గ్రామ పంచాయతీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు మంగళవారం బోరు వద్దకు వెళ్లారు. అయితే, అక్కడకు వెళ్లి చూసిన సర్పంచ్, వార్డు సభ్యులు ఒక్కసారిగా బిత్తరపోయారు. ఎవరో గుర్తుతెలియని దుండగులు బోరు బావి గుంతలోపల పెద్ద పెద్ద రాళ్లను వేసి, బోరు మోటార్ బిగించడానికి రాకుండా రాళ్ళు నింపారు.

కఠిన చర్యలు తీసుకోవాలి - సర్పంచ్ నాగిరెడ్డి డిమాండ్..

గ్రామ అభివృద్ధిని ఓర్వలేక, ప్రజల తాగునీటి అవసరాలను అడ్డుకుంటున్న ఇలాంటి అసాంఘిక శక్తులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని సర్పంచ్ నాగిరెడ్డి, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ నాగిరెడ్డి మాట్లాడుతూ.. గ్రామస్తులంతా ఊరి అభివృద్ధికి సహకరించాలని కోరారు. కన్నతల్లి లాంటి గ్రామాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ బోరు ధ్వంసానికి పాల్పడిన వారి వివరాలు ఎవరికైనా తెలిస్తే వెంటనే గ్రామ పంచాయతీకి గానీ, లేదా పోలీసులకు గానీ సమాచారం అందించి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Next Story