నగరంలో రూ.1.22 కోట్ల ట్రేడింగ్ మోసం.. ‘మ్యూల్ ఖాతాల’ ముఠా గుట్టురట్టు

by Kema Shiva Kumar |

హైదరాబాద్‌ మహానగరంలో రూ.కోట్ల భారీ ట్రేడింగ్ మోసం కేసులో మ్యూల్ ఖాతాలు నిర్వహిస్తున్న ఇద్దరు నిందితులను సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నగరంలో రూ.1.22 కోట్ల ట్రేడింగ్ మోసం.. ‘మ్యూల్ ఖాతాల’ ముఠా గుట్టురట్టు
X

దిశ, వెబ్‌డెస్క్: వాట్సాప్ గ్రూపులు, నకిలీ వెబ్‌సైట్ల ద్వారా భారీ లాభాల ఆశ చూపి అమాయకులను ముంచేస్తున్న అంతర్రాష్ట్ర సైబర్ ముఠా గుట్టును హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రట్టు చేశారు. ఓ బాధితుడి నుంచి రూ.1.22 కోట్లు నొక్కేసిన కేసులో దేశవ్యాప్తంగా మ్యూల్ ఖాతాల (Mule Accounts) భారీ నెట్‌వర్క్‌ను నిర్వహిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం మేరకు.. సైబర్ నేరగాళ్లు ముందుగా బాధితుడిని ఓ నకిలీ వాట్సాప్ ట్రేడింగ్ గ్రూప్‌లో మెంబర్‌గా చేర్చారు. అందులో స్టాక్ మార్కెట్, ఐపీవో (IPO)లలో పెట్టుబడులు పెడితే ఊహించని లాభాలు వస్తాయంటూ మాయమాటలు చెప్పి నమ్మించారు. తీరా నిజమేనని నమ్మిన బాధితుడు, నిందితులు సూచించిన నకిలీ (Fake) ట్రేడింగ్ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకుని, విడతల వారీగా మొత్తం రూ.1.22 కోట్లు పెట్టుబడి పెట్టాడు.

రూ.15.69 కోట్ల లాభం.. కట్ చేస్తే షాక్!

అయితే, సదరు బాధితుడు తాను మోసపోతున్నాడని గుర్తించకుండా ఉండేందుకు ఘరానా కేటుగాళ్లు తమ నకిలీ వెబ్‌సైట్ డాష్‌బోర్డ్‌ (Website Dashboard)లో ఫేక్ డేటాను చూపించారు. బాధితుడు పెట్టిన రూ.1.22 కోట్ల పెట్టుబడికి ఏకంగా రూ.15.69 కోట్ల లాభం వచ్చినట్లుగా స్క్రీన్‌పై కనిపించేలా చేశారు. ఆ డబ్బును విత్‌డ్రా చేసుకునేందుకు బాధితుడు ప్రయత్నించగా.. మరో కొత్త నాటకానికి తెరలేపారు. ఓ ప్రముఖ కంపెనీ ఐపీవో విడుదలవుతోందని, దానిని సబ్‌స్క్రైబ్ చేయాలంటే అదనంగా మరో రూ.35 లక్షలు కట్టాలంటూ డిమాండ్ చేశారు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.

దేశవ్యాప్తంగా 44 కేసులతో లింకులు..

బాధితుడి కంప్లయింట్ మేరకు రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ బృందం (Cyber ​​Crime Team) టెక్నికల్ ఆధారాల సాయంతో నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకుంది. విచారణలో భాగంగా సైబర్ నేరాల ద్వారా వచ్చే బ్లాక్ మనీని దారి మళ్లించేందుకు గాను భారీ ఎత్తున మ్యూల్ బ్యాంక్ ఖాతాల నెట్‌వర్క్‌ను నడుపుతున్నట్లుగా వెల్లడైంది. అదేవిధంగా నిందితులు వాడిన బ్యాంక్ ఖాతాలకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో నమోదైన దాదాపు 44 సైబర్ కేసులతో సంబంధాలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ప్రజలు ఇలాంటి నకిలీ ట్రేడింగ్ లింకులు, వాట్సాప్ గ్రూపుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పేర్కొన్నారు.

Next Story