​వేడెక్కిన తాడ్వాయి రాజకీయం

by Ratna Kumari |

యూరియా యాప్ రద్దు చేయాలని కోరుతూ బిఆర్ఎస్ పార్టీ నాయకులు చేపట్టిన ధర్నా ముగిసినప్పటికీ, ఆ వివాదం సద్దుమణగడం లేదు.

​వేడెక్కిన తాడ్వాయి రాజకీయం
X

దిశ,​తాడ్వాయి : యూరియా యాప్ రద్దు చేయాలని కోరుతూ బిఆర్ఎస్ పార్టీ నాయకులు చేపట్టిన ధర్నా ముగిసినప్పటికీ, ఆ వివాదం సద్దుమణగడం లేదు. తాజాగా ఈ వ్యవహారం సీడీసీ చైర్మన్ ఇర్షుద్దీన్, తాడ్వాయి సొసైటీ చైర్మన్ కపిల్ రెడ్డిల మధ్య వ్యక్తిగత, రాజకీయ సవాళ్లకు దారితీసింది. సోషల్ మీడియా వేదికగా ఇరువురు నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటూ, బహిరంగ చర్చకు రావాలంటూ సవాళ్లు విసురుకున్నారు.

ఆధారాలతో వస్తా.. ఎక్కడికి రావాలో చెప్పు...సీడీసీ చైర్మన్ ఇర్షుద్దీన్

​తాడ్వాయి సొసైటీ చైర్మన్ కపిల్ రెడ్డి సమయానికి డీడీలు కట్టకుండా ఎగ్గొట్టి, రైతులకు యూరియా సరఫరా. కాకుండా అడ్డుకుంటావా అంటూ సోషల్ మీడియా వేదికగా సవాల్ విసిరారు. సొంత అప్పులు భరించలేక పెట్రోల్ పోసుకొని,ఇప్పుడు రైతుల కోసం అంటూ నాటకాలు ఆడుతున్నారు.మొన్నటికి మొన్న మక్కల కొనుగోలు కేంద్రంలో ఒక్కొక్క రైతు దగ్గర రెండు నుంచి మూడు క్వింటాళ్ల చొప్పున కోత విధించారు.దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు,లిస్టు నా దగ్గర ఉన్నాయి.ఆ లిస్ట్ పట్టుకొని ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా.కపిల్ రెడ్డి చర్చకు సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు.

ఆధారాలుంటే సొసైటీకి రా.. గంట ముందే ఉంటా...సొసైటీ చైర్మన్ కపిల్ రెడ్డి

​ఇర్షుద్దీన్ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదు. సొసైటీకి కావాల్సిన యూరియా కొరకు నేను డీడీలు కట్టిన తేదీల రికార్డులు నా దగ్గర ఉన్నాయి. వాటికంటే ముందే మార్కెట్ సొసైటీకి రావాల్సిన డబ్బులు జమ అయి ఉన్నాయి. తాడ్వాయి సొసైటీకి ఎప్పుడొస్తావో రా.. నువ్వు వచ్చే గంట ముందే నేను అక్కడ ఉంటా. ఎవరో చెప్పిన అబద్ధాలు పట్టుకొని మాట్లాడడం సరికాదు.మక్కల కొనుగోలులో క్వింటాళ్లు కట్ అయినట్టు నీ దగ్గర ఆధారాలు ఉంటే చూపించు. నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న ఇర్షుద్దీన్, ఏండ్రియల్‌కు ఎప్పుడు వస్తాడో చెప్పాలి. నేను దేనికైనా సిద్ధం అంటూ సోషల్ మీడియా వేదికగా ఆయన బదులిచ్చారు.ఏదేమైనా రైతుల సమస్యల చుట్టూ తిరిగిన ఈ వివాదం, ఇప్పుడు ఇద్దరు కీలక నేతల మధ్య సవాళ్లు,ప్రతిసవాళ్లకు దారితీయడంతో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.ఈ సోషల్ మీడియా వార్ ఎటు దారితీస్తుందోనని స్థానికంగా చర్చ నడుస్తోంది.

Next Story