- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బోగస్, నకిలీ ఓట్లు తొలగించండి: ఈసీకి బీఆర్ఎస్ టీమ్ వినతి
ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలస్తంభమైన ఎన్నికల ప్రక్రియను బోగస్, నకిలీ ఓట్ల బెడద నుంచి పూర్తిగా విముక్తి చేయకుండా ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియ తన అసలు లక్ష్యాన్ని చేరుకోలేదని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు...

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలస్తంభమైన ఎన్నికల ప్రక్రియను బోగస్, నకిలీ ఓట్ల బెడద నుంచి పూర్తిగా విముక్తి చేయకుండా ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియ తన అసలు లక్ష్యాన్ని చేరుకోలేదని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. బుధవారం పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఎన్నికల పవిత్రతకు విఘాతం కలిగించే బోగస్, నకిలీ ఓట్ల సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థనే ప్రమాదంలోకి నెట్టినట్లవుతుందని హెచ్చరించారు. డూప్లికేట్, బోగస్ ఓటర్లు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడమే కాకుండా ప్రజల అసలు తీర్పును వక్రీకరించే ప్రమాదం కలిగిస్తారని పేర్కొన్నారు.
ఈ సమస్యను పరిష్కరించడానికే ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం చేపట్టినప్పటికీ, ఒక రాష్ట్రంలో ఓటు హక్కు కొనసాగిస్తూ మరో రాష్ట్రంలో కూడా ఓటరుగా నమోదైన వారిని గుర్తించి తొలగించే స్పష్టమైన విధానం ఇప్పటికీ లేకపోవడం ఆందోళన కలిగించే అంశమన్నారు. హైదరాబాద్‌లో ఒకే వ్యక్తికి రెండు రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉండటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, అటువంటి నమోదులను గుర్తించి తొలగించడంలో ఎన్నికల సంఘం ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులు ఉమ్మడిగా పనిచేస్తూ రెండు రాష్ట్రాల ఓటరు జాబితాలను పరస్పరం పరిశీలించాలని కోరారు.
ఒకే నియోజకవర్గంలో నమోదైన నకిలీ ఓట్లు, వేర్వేరు నియోజకవర్గాల్లో నమోదైన నకిలీ ఓట్లు, వేర్వేరు రాష్ట్రాల్లో నమోదైన నకిలీ ఓట్లు అన్నింటినీ సమగ్రంగా గుర్తించి తొలగించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, బీఆర్ఎస్ నాయకుడు కురువ విజయ్ తదితరులు పాల్గొన్నారు.






