- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జలసౌధలో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష.. తుంగభద్ర జలాల హక్కులపై అధికారులకు దిశానిర్దేశం
జలసౌధలో తుంగభద్ర జలాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల హక్కులు, అంతర్రాష్ట్ర జల వివాదాలపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రత్యేకంగా ఫెకస్ పెట్టారు. ఈ మేరకు ఇవాళ నగరంలోని జలసౌధలో తుంగభద్ర జలాల సంబంధిత అంశాలపై సీఎం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy), ప్రభుత్వ ముఖ్య అధికారులు, చీఫ్ ఇంజినీర్లు పాల్గొన్నారు. అయితే, తుంగభద్ర నది నీటిలో తెలంగాణకు దక్కాల్సిన న్యాయపరమైన వాటా, రాష్ట్ర హక్కుల పరిరక్షణే ధ్యేయంగా ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలతో ముడిపడి ఉన్న విభిన్న అంతర్రాష్ట్ర జల అంశాలపై సీఎం సుదీర్ఘంగా సమీక్షించారు. పొరుగు రాష్ట్రాల నుంచి ఎదురవుతున్న సవాళ్లు, వాటిని అధిగమించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఆర్డీఎస్, తుమ్మిళ్ల పనులపై ఆరా..
అయితే, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు వరప్రదాయిని అయిన రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (RDS) ఆధునీకరణ పనుల పురోగతిపై సీఎం ఆరా తీశారు. ఆర్డీఎస్ పనులను వేగవంతం చేసి, చివరి ఆయకట్టుకు నీరందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వీటితో పాటు తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం (Tumilla Lift Irrigation) పనుల ప్రస్తుత పరిస్థితి, నిధుల విడుదల, పనుల్లో ఉన్న అడ్డంకులను తొలగించే అంశాలపై మంత్రితో కలిసి సమీక్షించారు. అదేవిధంగా తుంగభద్ర బోర్డు పరిధిలోని తాజా పరిణామాలు, నీటి లభ్యత, బోర్డు సమావేశాల్లో రాష్ట్రం వినిపించాల్సిన వాదనలపై నీటిపారుదల శాఖ అధికారులు సీఎం ఎదుట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమగ్ర వివరాలను వివరించారు. రాష్ట్ర ప్రయోజనాలపై రాజీ పడకుండా.. అంతర్రాష్ట్ర జల వివాదాలపై లీగల్ టీమ్‌తో కూడా సమన్వయం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు.






