- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీజీఎస్‌ఆర్టీసీలో వ్యాపార అవకాశాలు... 694 షాపులకు టెండర్లు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే కాకుండా, సంస్థ పరిధిలోని వనరులను సద్వినియోగం చేసుకుంటూ ఆదాయాన్ని పెంచుకునే దిశగా వినూత్న అడుగులు వేస్తోంది..

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే కాకుండా, సంస్థ పరిధిలోని వనరులను సద్వినియోగం చేసుకుంటూ ఆదాయాన్ని పెంచుకునే దిశగా వినూత్న అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ వ్యాపార సముదాయాలను (కమర్షియల్ కాంప్లెక్సులు) అద్దె ప్రాతిపదికన కేటాయించేందుకు సంస్థ సిద్ధమైంది. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి, తమ సంస్థలను విస్తరించుకోవాలనుకునే వారికి ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ గా భావిస్తున్నారు. సాధారణంగా ఏ వ్యాపారానికైనా కస్టమర్ల రాక అనేది అత్యంత కీలకం. ఆర్టీసీ బస్టాండ్లు, కాంప్లెక్స్‌లు నిరంతరం ప్రయాణికులతో రద్దీగా ఉంటాయి. ప్రతిరోజూ లక్షలాది మంది ప్రజలు రాకపోకలు సాగించే ఈ ప్రాంతాల్లో వ్యాపారాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల, ఎలాంటి ప్రచార ఖర్చులు లేకుండానే వ్యాపారస్తులకు కస్టమర్లు లభిస్తారు. హోటళ్లు, ఫుడ్ కోర్టులు, సూపర్ మార్కెట్లు, బ్రాండెడ్ షోరూమ్‌ల నుండి చిన్న తరహా దుకాణాల వరకు అన్ని రకాల వ్యాపారాలకు ఆర్టీసీ కమర్షియల్ కాంప్లెక్స్ లు అనువైన వేదికలుగా మారనున్నాయి.
694 షాపులకు త్వరలోనే టెండర్లు...
ఆర్టీసీ చరిత్రలోనే సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతూ, దళారీ వ్యవస్థకు పూర్తిగా చెక్ పెట్టేలా సంస్థ పరిధిలోని అన్ని వ్యాపార సముదాయాల వివరాలను యాజమాన్యం అధికారిక వెబ్‌సైట్ tgsrtc.telangana.gov.in లో బహిరంగపరిచింది. ఏ ఏ ప్రాంతాల్లో ఎన్ని వ్యాపార సముదాయాలు ఉన్నాయి, అవి ఖాళీగా ఉన్నాయా, ప్రస్తుతం ఆ షాప్ లను ఎవరు నిర్వహిస్తున్నారు, వారి లీజు కాలపరిమితి మరియు అద్దె ఎంత అనే పూర్తి సమాచారాన్ని క్లియర్ కట్‌గా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు. అద్దెదారుల ఎంపికలో డిజిటల్ జవాబుదారీతనాన్ని పెంచేందుకు తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
త్వరలోనే టెండర్లు
రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాలు, పట్టణాలు, డిపోల పరిధిలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న 694 షాపులకు త్వరలోనే టెండర్లు పిలవనున్నారు. సంస్థను లాభాల బాట పట్టించడంతో పాటు, స్థానిక నిరుద్యోగులకు, వ్యాపారస్తులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉన్నతాశయంతో పారదర్శకమైన నిబంధనలు, లీజు పద్ధతుల ద్వారా ఈ స్థలాలను కేటాయించనున్నారు. టీజీఎస్‌ఆర్టీసీ తీసుకున్న ఈ వినూత్న నిర్ణయం అటు రవాణా సంస్థకు అదనపు ఆదాయాన్ని సమకూరుస్తూ, ఇటు వ్యాపార రంగానికి సరికొత్త ఊతాన్ని ఇస్తుందని ఆర్ధిక నిపుణులు భావిస్తున్నారు. ఈ సువర్ణావకాశాన్ని అందుపుచ్చుకుని వ్యాపారంలో రాణించాలని సంస్థ వర్గాలు కోరుతున్నాయి.
చక్కని అకాశం... సద్వినియోగం చేసుకోండి.
"ఆర్టీసీ స్థలాల్లో షాప్స్ నిర్వహణ ప్రక్రియను మరింత సరళతరం చేశాం. వ్యాపారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ అవకాశాన్ని వాడుకోవచ్చు. టీజీఎస్ ఆర్టీసీ కల్పిస్తున్న ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకుని వ్యాపార వృద్ధిని సాధించడమే కాకుండా, సంస్థ ప్రగతిలో భాగస్వాములు కావాలి."
- వై.నాగిరెడ్డి, ఎండీ టీజీఎస్‌ఆర్టీసీ






