- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేసీఆర్ నియంతలా రాష్ట్రాన్ని పాలించారు: ఎంపీ మల్లు రవి ధ్వజం
కేసీఆర్ ఒక నియంతలా, రాజులా పరిపాలన సాగించారని నాగర్‌కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి తీవ్ర స్థాయిలో విమర్శించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో హిట్లర్ ప్రభుత్వం నడుస్తోందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలపై నాగర్‌కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో నడుస్తోంది హిట్లర్ పాలన కాదని, పేదలకు అనుకూలంగా పనిచేసే ‘ఇందిరమ్మ రాజ్యం’ అని ఆయన స్పష్టం చేశారు. బుధవారం సీఎల్పీ (CLP) మీడియా సెంటర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మల్లు రవి మాట్లాడారు. నిజమైన హిట్లర్ రాజ్యం నడిచింది గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనేనని ఆయన ధ్వజమెత్తారు.
మీ పాలనలో హోంమంత్రికే అపాయింట్‌మెంట్ లేదు..
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్యానికి తావులేకుండా పోయిందని మల్లు రవి ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో స్వయంగా హోంమంత్రికే ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ దొరకలేదన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలను సైతం ప్రగతి భవన్‌లోకి అడుగు పెట్టనివ్వలేదని.. కేసీఆర్ ఓ నియంతలా, రాజులా పరిపాలన సాగించారని కామెంట్ చేశారు. ఆ హిట్లర్ తరహా పరిపాలన నచ్చకే ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను ఓడించారని అన్నారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఘోరంగా బుద్ధి చెప్పారని మల్లు రవి విమర్శించారు. ప్రజలకు ఏం కావాలో అది చేయకుండా.. కేసీఆర్ తన స్వంత ఆలోచనల ప్రకారమే పాలన చేశారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో పెద్ద సెక్రటేరియట్, పెద్ద పెద్ద కలెక్టరేట్ భవనాలు ఉండాలని ప్రజలెప్పుడూ కోరుకోలేదని మల్లు రవి హితవు పలికారు.






