- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమెరికాలో ఘనంగా ‘మాటా’ మహాసభలు.. సినీ సెలబ్రెటీలతో కవర్‌ఫుల్‌గా మారిన వేడుకలు
ఉత్తర అమెరికాలో తెలుగు సంస్కృతి, సేవా కార్యక్రమాలు, సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలిచిన మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (MATA) 2వ మహాసభలు ఘనంగా జరిగాయి. పెన్సిల్వేనియాలోని గ్రేటర్ ఫిలడెల్ఫియా ఎక్స్‌పో సెంటర్, ఫెయిర్‌గ్రౌండ్స్‌లో రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ వేడుకల్లో సినీ ప్రముఖులు పాల్గొని సందడి చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తర అమెరికాలో తెలుగు సంస్కృతి, సేవా కార్యక్రమాలు, సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలిచిన 'మన అమెరికన్ తెలుగు అసోసియేషన్' (MATA) రెండో మహాసభలు అత్యంత ఘనంగా జరిగాయి. పెన్సిల్వేనియాలోని గ్రేటర్ ఫిలడెల్ఫియా ఎక్స్‌పో సెంటర్, ఫెయిర్‌గ్రౌండ్స్‌లో రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ వేడుకల్లో టాలీవుడ్ సినీ ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. దాదాపు 7,500 మందికి పైగా తెలుగు కుటుంబాలు హాజరుకావడంతో.. ఉత్తర అమెరికాలోనే ఇది అతిపెద్ద తెలుగు సమ్మేళనాల్లో ఒకటిగా నిలిచింది.
తారల తళుకులు.. డీఎస్పీ, రామ్ మిర్యాల లైవ్ షో
సినీ ప్రముఖుల రాకతో 'మాటా' వేడుకలు మరింత కలర్‌ఫుల్‌గా మారాయి. నటులు నిఖిల్ సిద్ధార్థ్, ఐశ్వర్య రాజేష్, జయప్రద, సుమన్, అలీ, హాలీవుడ్ నటుడు విషి అయ్యర్, హాస్యనటులు శివారెడ్డి, అధిరే అభి, సునామి సుధాకర్, మిమిక్రీ రమేష్ తదితరులు తమ ప్రదర్శనలతో ఆహూతులను అలరించారు. సంగీత దర్శకుడు, రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ (DSP) తన లైవ్ కాన్సర్ట్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ప్రపంచ స్థాయి ఆడియో-విజువల్ సాంకేతికత, అద్భుతమైన లైటింగ్‌తో ఈ కార్యక్రమం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. గాయకుడు రామ్ మిర్యాల లైవ్ మ్యూజికల్ షో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ వేడుకలకు తొలిరోజు యాంకర్ నిఖిల్ విజయేంద్ర సింహా హోస్ట్‌గా వ్యవహరించగా.. రెండవ రోజు స్టార్ యాంకర్లు సుమ కనకాల, ప్రదీప్ మాచిరాజు తమదైన శైలిలో షోను నడిపించి వేడుకల్లో ఉత్తేజం నింపారు.
జయప్రదకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు
ఈ మహాసభల వేదికపై ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రదకు 'MATA లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు' ప్రదానం చేశారు. అలాగే ‘ప్రైడ్ ఆఫ్ ఇండియా’ అవార్డులను డాక్టర్ ఎం.ఎస్. రెడ్డి, డాక్టర్ హరినాథ్ పోలిచర్లలకు అందజేశారు. సమాజ సేవ, వ్యాపారం, కళలు, వైద్యం, సాంకేతిక ఆవిష్కరణలు తదితర రంగాల్లో విశిష్ట సేవలు అందించిన పలువురికి 'MATA ఎక్సలెన్స్ అవార్డులు' అందజేశారు. అవార్డులు అందుకున్న ప్రముఖుల్లో టీ.పీ. శ్రీనివాస్ రావు (బిజినెస్ & ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్), భాస్కర్ గంటి (ఫిలాంత్రఫీ), సాయినాథ్ కర్నాటి (యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్), స్వాతి అట్లూరి (ఆర్ట్స్ & కల్చర్), దాము గేదల (కమ్యూనిటీ సర్వీస్). డా. విజయ్ భాస్కర్ బొల్గం (హ్యూమానిటేరియన్ సర్వీస్), నాగేశ్వరరావు పూజారి (ఫిల్మ్ కేటగిరీ). రాజు చామర్తి (గ్లోబల్ తెలుగు హెరిటేజ్), కృష్ణ మద్దిపట్ల (కమ్యూనిటీ సర్వీస్) ఉన్నారు.
భక్తిభావం.. మత సామరస్యం
గ్రాండ్ బ్యాంక్వెట్‌తో ప్రారంభమైన ఈ మహాసభల్లో తెలుగు, భారతీయ, అంతర్జాతీయ వంటకాలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక విందు అందరినీ ఆకట్టుకుంది. ప్రధాన మహాసభ మత సామరస్యానికి ప్రతీకగా హిందూ పూజారి, ఇమామ్, క్రైస్తవ పాస్టర్ల సంయుక్త ప్రార్థనలతో ప్రారంభం కావడం విశేషం. అనంతరం నిర్వహించిన శ్రీ సీతారామ శోభాయాత్ర, భద్రాచల సీతారామ కళ్యాణ మహోత్సవం, పట్టాభిషేక కార్యక్రమాలు భక్తులను భక్తిపారవశ్యంలో ముంచెత్తాయి. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు లీడర్‌షిప్, బిజినెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మహిళా సాధికారత, వైద్య, న్యాయ, రాజకీయ, సాహిత్య రంగాలపై ప్రత్యేక ఫోరమ్‌లు (సదస్సులు) నిర్వహించారు. 'MATA సింగింగ్ స్టార్' పోటీల్లో ఉత్తర అమెరికా నలుమూలల నుంచి 300 మందికి పైగా గాయకులు పాల్గొని తమ ప్రతిభను చాటారు.
అద్భుత నిర్వహణ.. 'మాటా' ఆశయాల ప్రతిబింబం
MATA అధ్యక్షుడు రమణ కిరణ్ దుద్దాగి, కన్వీనర్ శ్రీధర్ గూడల నాయకత్వంలో, వ్యవస్థాపకులు, అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులు శ్రీనివాస్ గణగోని, ప్రదీప్ సామల, అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులు జితేందర్ రెడ్డి మార్గదర్శకత్వంలో ఈ వేడుకలు జరిగాయి. మహాసభల విజయానికి కో-కన్వీనర్లు టోనీ జన్ను, దాము గేదల, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ గుడూరు, జనరల్ సెక్రటరీ విజయ్ భాస్కర్ కలాల్, కన్వెన్షన్ కోఆర్డినేటర్ కళ్యాణి బెల్లంకొండ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నాగేశ్ చిలకపాటి, ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మహేందర్ నారాల, డైరెక్టర్లు శిరీష గుండపునేని, స్వాతి అట్లూరి, అడిషనల్ సెక్రటరీ శ్రీధర్ పెంట్యాల, ఇండియా కోఆర్డినేటర్ డా. విజయ భాస్కర్ బొల్గం, మీడియా డైరెక్టర్ ప్రశాంత్ శ్రీపెరంబుదూరు, స్పోర్ట్స్ డైరెక్టర్ సురేష్ ఖాజానా తదితరుల సేవలు ఎంతో కీలకమైనవని నిర్వహకులు ప్రకటించారు. సేవ, సంస్కృతి, సమానత్వం అనే నినాదంతో జరిగిన ఈ మహాసభలు ప్రపంచ తెలుగు సమాజ ఐక్యతను చాటిచెప్పాయి.






