Gold: డాలర్ దెబ్బకు బంగారం బోల్తా

by S Gopi |   (  Updated:2026-06-24 14:41:23  IST  )

అంతర్జాతీయ మార్కెట్లలో స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు 4,050 డాలర్ల సమీపానికి జారిపోగా, వెండి కూడా దాదాపు 2 శాతం క్షీణించింది.

Gold: డాలర్ దెబ్బకు బంగారం బోల్తా
X

దిశ, బిజినెస్ బ్యూరో: అమెరికా డాలర్ మరింత బలపడటం, అంతర్జాతీయ మార్కెట్లలో రిస్క్-ఆఫ్ సెంటిమెంట్ పెరగడం వల్ల బంగారం, వెండి ధరలు వరుసగా రెండో రోజు కూడా క్షీణించాయి. దేశ రాజధానిలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర 10 గ్రాములకు రూ.1,48,100కు చేరగా, వెండి కూడా కిలోకు రూ.4,000 పడిపోయి రూ.2,45,000 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లలో స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు 4,050 డాలర్ల సమీపానికి జారిపోగా, వెండి కూడా దాదాపు 2 శాతం క్షీణించింది. డాలర్ ఇండెక్స్ 2025, మే తర్వాత గరిష్ఠ స్థాయిని తాకడంతో విలువైన లోహాలకు పరిస్థితులు ప్రతికూలంగా మారింది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, హైదరాబాద్ మార్కెట్లో స్వచ్ఛమైన పసిడి 10 గ్రాములు రెండు రోజుల్లో రూ. 4,200 క్షీణించి రూ. 1,44,330 వద్ద ఉండగా, ఆభరణాల్లో వాడే 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం రూ. 3,500 పడిపోయి రూ. 1,32,300కి చేరింది. వెండి రూ. 10 వేలు క్షీణించి కిలో రూ. 2.40 లక్షల వద్ద ఉంది. మరోవైపు, మంగళవారం భారీ పతనం తర్వాత భారత స్టాక్ మార్కెట్లు బుధవారం బలంగా కోలుకున్నాయి. సెన్సెక్స్ 790.54 పాయింట్లకు పైగా ఎగిసి 76,991కి చేరగా, నిఫ్టీ 197.55 పాయింట్లు పెరిగి 24,021 చేరింది. తగ్గుతున్న ముడి చమురు ధరలు, భారత్-అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై పెరుగుతున్న ఆశలు, ప్రపంచ టెక్ మార్కెట్లలో అమ్మకాల ప్రభావం భారత మార్కెట్‌పై పరిమితంగా ఉండటం పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను బలపరిచాయి.

Next Story